/rtv/media/media_files/2026/02/05/fotojet-19-2026-02-05-17-10-12.jpg)
Municipal Elections Rebel Candidates
Rebel Candidates : తెలంగాణలో ఎక్కడ చూసిన పురపాలక ఎన్నికల సందడి నెలకొంది. అయితే ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన పలువురు రెబల్ అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. దీంతో ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగలు ఆరడం లేదు. ఆయా పార్టీలు చేస్తున్న బుజ్జగింపులు ఫలించకపోవడంతో పలువురు పార్టీకి వ్యతిరేకంగా బరిలో నిలిచి(రెబల్స్​) ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్​, బీజేపీ పార్టీలకు చాలా వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులతో ఇబ్బంది తప్పడం లేదు. కొన్నిచోట్ల పార్టీ అధిష్టానం హెచ్చరికలు ఫలించకపోవడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికీ వారు ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో పలుచోట్ల తమ గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉందని పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టికెట్లు ఆశించిన పలువురికి టికెట్లు రాకపోవడంతో మొదలైన వివాదాలు, నామినేషన్ల ఉపసంహరణ నాటికి మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. పలుచోట్ల బీ-ఫాంలు చేతికందని అభ్యర్థులు తమ పార్టీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొన్నిచోట్ల ఇవి తారస్థాయికి చేరి పార్టీ నాయకత్వా్న్ని దూషించే స్థాయి వరకు వెళ్లింది. అయితే పార్టీ నాయకులు మాత్రం వివిధ సమీకరణలు, అభ్యర్థులకున్న పట్టును అంచనావేసి బీ-ఫాంలను ఇచ్చామని చెబుతున్నారు. టికెట్ రానివారిలో చాలామంది అప్పటికే ఎన్నికల ప్రచారంలోకి దిగడం, ఎన్నికల షెడ్యూల్ నుంచి వార్డుల్లో పర్యటిస్తూ పోటీలో ఉంటామని ప్రజలను కలవడంతో నామినేషన్ల ఉపసంహరణలకు వారు ఆసక్తి చూపడం లేదు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు కరీంనగర్ కార్పొరేషన్‌లోని 3 డివిజన్లలో బీజేపీకి కూడా తిరుగుబాటు తప్పలేదు. తమకు టికెట్ నిరాకరించారని వారు ఇండిపెండెంట్లుగా బరిలో నిలవడమే కాకుండా ప్రచారంలో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ 3 డివిజన్లలో సై అంటే సై అనేలా పోరుకు సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 467 డివిజన్లు, వార్డుల్లో దాదాపు 50 చోట్ల పార్టీలకు రెబల్స్ బెడద తప్పడం లేదు.
ఖమ్మం జిల్లాలోని వైరాలో 8 వార్డులలో 9 మంది అధికార పార్టీకి రెబెల్స్‌గా ఎన్నికల బరిలో ఉన్నారు. సత్తుపల్లిలో ఒక వార్డులో, కల్లూరులో రెండుచోట్ల భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్​) తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఉమ్మడి వరంగల్‌లో 260 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి 26 మంది రెబల్ అభ్యర్థులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో కాంగ్రెస్ నుంచి ఏడుగురు తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు.నాగర్‌కర్నూల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జగన్ పార్టీకి రిజైన్ చేశారు. కల్వకుర్తిలోని 11వ వార్డులో నామినేషన్ వేసినప్పటికీ టికెట్ దక్కలేదు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లిలో బీఆర్ఎస్ టికెట్లు రాని 9 మంది ఏఐఎఫ్బీ నుంచి పోటీలో ఉన్నారు. టికెట్ రాకపోవడంతో వనపర్తి జిల్లాలోని పెబ్బేరు 3 వార్డులో మాజీ కౌన్సిలర్ సువర్ణ, ఆమె భర్త కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు వెంకట్రాములు ఇద్దరూ ఎన్నికల బరిలో ఉంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.
మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో ముగ్గురు, బీఆర్ఎస్ ఒకరు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, సదాశివపేట, జహీరాబాద్, గడ్డిపోతారం, అందోలు బల్దియాల్లో తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. మరోవైపు సంగారెడ్డిలో ముగ్గురు కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేశారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి 15 మంది, భారత రాష్ట్ర సమితికి ఆరుగురు రెబల్ అభ్యర్థులున్నారు. సూర్యాపేటలో కాంగ్రెస్‌లో 8 మంది, బీఆర్​ఎస్​లో 3, నల్గొండ కార్పొరేషన్లో మూడు పార్టీల తరఫున ఒక్కో డివిజన్లో ఒకరు చొప్పున తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.తిరుమలగిరిలో కాంగ్రెస్ నుంచి నలుగురు, భారత రాష్ట్ర సమితి నుంచి ఒకరు రెబల్ అభ్యర్థులున్నారు. రెబల్ అభ్యర్థుల కారణంగా తమ భవితవ్యం తారుమవుతుందని ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభర్థులు వాపోతున్నారు.
Follow Us