/rtv/media/media_files/2025/10/08/local-2025-10-08-17-04-42.jpg)
Sarpanch Elections
Sarpanch Elections : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే, చాలాచోట్ల రిజర్వేషన్ల ప్రక్రియ చిత్రవిచిత్రంగా తయారయింది. కొన్ని చోట్ల ఎస్సీలకు రిజర్వ్ అయితే అక్కడ ఎస్సీలే లేరు. బీసీలకు వస్తే ఒకే ఒకరు ఉన్నారు. ఇక ఎస్టీలకు వస్తే వారి జాడే లేదు. ఇలా రాష్ట్రమంతా గందరగోళంగా తయారయింది.
ఎస్టీ ఓటర్లే లేరు..
నల్లగొండ జిల్లాలోని మూడు గ్రామాల్లో ఎస్టీ కేటగిరీలో ఒక్క అభ్యర్థి లేరు.అయినా ఆ గ్రామాల సర్పంచి పదవులు ఎస్టీకి రిజర్వు అయ్యాయి. దీంతో అక్కడ ఎవరూ పోటీ చేయాలో తెలియన పరిస్థితి ఏర్పడింది. మాడుగులపల్లి మండలం అభంగాపురం గ్రామంలో ఎస్టీలు ఎవరూ లేకపోయినా, ఆ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయింది. అదేవిధంగా అనుముల మండలం పేరూరు ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. అక్కడ ఎస్టీ మహిళ ఒక్కరూ లేకపోగా, ఒకే ఒక్క ఎస్టీ పురుషుడు ఉన్నారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్లగౌరారం పంచాయతీలో 8 వార్డులకు గాను 4 వార్డులు ఎస్టీ జనరల్, 4 వార్డులు ఎస్టీ మహిళలకు కేటాయించారు. అయితే గ్రామంలో ఎస్టీ ఓ టర్లే లేరు. గతంలో కూడా రెండు వార్డులు ఎస్టీలకు కేటాయించగా, అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. తిరుమలగిరి(సాగర్) మండలంలోని చింతలపాలెం గ్రామ పంచాయతీ కూడా ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. అక్కడ ఎస్టీ మహిళ ఒక్కరూ లేరు.
మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. అక్కడ ఎస్టీ ఓట్లు రెండే ఉన్నాయి. దీంతో అక్కడ సర్పంచ్‌గా ఎస్టీ మహిళ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. గజాలాపురం కూడా ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా, అక్కడ ఎస్టీ మహిళ ఒక్కరే ఉన్నారు. అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయింది. అక్కడ ఎస్టీలు 11 మందే ఉన్నారు.
17 గ్రామాలున్నా.. బీసీలకు సున్నా
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో 17 గ్రామాలు ఉన్నాయి.. ఇందులో వంద శాతం గిరిజన జనాభా ఉన్న ఆరు గ్రామాలను ఎస్టీలకు కేటాయించారు. మిగిలిన 11 గ్రామాల్లో మళ్లీ ఎస్టీలకు రెండు, ఎస్సీలకు మూడు, మిగతా ఆరు గ్రామాలకు జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ కలిపించారు. కానీ, బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, స్థానికులు రిజర్వేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్‌ను సోమవారం కలిశారు.
వారికి ఒక్క గ్రామం రాలేదు
నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో జనాభా పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నా ఒక్క గ్రామం కూడా రిజర్వు కాలేదు. అందులో అడవిదేవులపల్లి మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిల్లో ఎస్సీ, బీసీల జనాభా ఎక్కువగానే ఉన్నా అక్కడ ఒక్క గ్రామం కూడా ఎస్సీలకు, బీసీలకు రిజర్వు కాలేదు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో ఒక్కటీ బీసీలకు దక్కలేదు. చండూరు మండలంలో ఎస్టీలు ఉన్నా.. 19 గ్రామ పంచాయతీల్లో ఒక్కటీ వారికి దక్కలేదు.
మల్లమ్మది అదృష్టం..
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లిలో ఎస్సీలే లేరు. కానీ, ఎస్సీ మహిళకు సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించారు. ఇటీవల బతుకుదెరువు కోసం ఆ ఊరికి వచ్చిన ఎస్సీ మహిళ ఒక్కరే ఉండడంతో ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్ కానుంది. నాలుగేళ్ల క్రితం వర్ధన్నపేట మండలం రామారం నుంచి కొంగర మల్లమ్మ పనికోసం ఆశాలపల్లి గ్రామానికి వచ్చారు. ఇప్పుడు మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటరుగా నమోదై ఉంది. అలాగే వంజరపల్లి పంచాయతీ పరిధిలో గతంలో రేఖియానాయక్ తండా ఉండేది. 2018లో తండాలను, శివారు గ్రామాలను నూతన పంచాయతీలుగా చేసిన సమయంలో వంజరపల్లి పరిధిలోని రేఖియానాయక్ తండాను పోచమ్మతండా పంచాయతీలో వీలినం చేశారు. దీంతో వంజరపల్లిలో ఎస్టీలు ఒకరూ కూడలేరు. కానీ, గ్రామంలోని రెండు వార్డులు ఎస్టీలకు కేటాయించడంతో ఎస్టీలు లేక ఆ వార్డులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ గ్రామాలకు సర్పంచ్‌లే లేరు
నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీప్రాంతం ఏజెన్సీ ఏరియాలోని 50 గ్రామాలు ఎస్టీ రిజర్వ్ అయ్యాయి. వీటిలో అమ్రాబాద్ మండలంలోని మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్‌నగ ర్‌కాలనీ, లక్ష్మాపురం గ్రామాలు గత పంచాయతీ ఎన్నికల్లోనూ ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. అయితే ఈ గ్రామాల్లో ఎస్టీ కుటుంబాలే లేకపోవడంతో సర్పంచులుగా ఎవరూ పోటీచేయలేకపోయారు. ఈ ఐదు గ్రామాలకు సర్పంచులు లేకుండానే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. ఈసారి కూడా ఈ గ్రామాలు ఎస్టీ రిజర్వ్ కావడంతో సర్పంచులు లేకుండానే కొనసాగనున్నాయి.
జనాభా ఎస్సీ.. రిజర్వేషన్ జనరల్
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మల్లంపల్లి, అయ్యవారిగూడెం గ్రామాల్లో ఎస్సీ సామాజిక వర్గం ఉంది. కానీ, రెండు గ్రామాలు జనరల్ కు రిజర్వేషన్లు కావడం, ఇతర వర్గాలు లేకపోవడంతో ఎస్సీ వర్గానికి చెందిన వారే జనరల్ స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.
ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరూ దక్కలే!
కాగా, జిల్లాను యూనిట్ గా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేయడం, రొటేషన్​ పద్ధతి అవలంభించడం, బీసీ డెడికేటెడ్​ కమిషన్​ సిఫార్సుల వల్ల ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 27 మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. అత్యధికంగా మహబూబాబాద్​ జిల్లాలోని ఆరు మండలాల్లో.. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని ఐదేసి మండలాల్లో బీసీలకు ఒక్కసీటూ దక్కలేదు. దీంతో సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం, జన్నారంలో బీసీలు ధర్నా నిర్వహించగా.. కోటపల్లిలో బీజేపీ నేతలు కలెక్టర్​ను కలిసి బీసీలకు ఒకటి, రెండైనా సర్పంచ్​స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పలు మండలాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు కూడా ఒక్క గ్రామం కూడా రిజర్వ్​చేయకపోవడంతో ఆయా చోట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లో సర్పంచ్​, వార్డు మెంబర్​స్థానాల్లో ఎస్టీలకు 10, ఎస్సీలకు 17, బీసీలకు 23 శాతానికి అటు ఇటుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. రొటేషన్​పద్ధతిలో గతంలో రిజర్వ్​అయిన గ్రామాలను ఈ లిస్టుల్లోంచి తొలగించారు. దీని వల్ల కొన్ని మండలాల్లో బీసీలకు ఎక్కువ గ్రామాలు (జనాభా ఎక్కువగా ఉండడం, రొటేషన్​ పద్ధతిలో కలిసిరావడం వల్ల) రిజర్వ్​ కాగా.. కొన్ని మండలాల్లో ఒకటి, రెండు గ్రామాలే దక్కాయి. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం 27 మండలాల్లోనైతే బీసీలకు ఒక్క సర్పంచ్​ స్థానమూ దక్కలేదు.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం జిల్లాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు దక్కని మండలాలు - 27
జిల్లా మండలాలు
ఖమ్మం రఘునాథపాలెం, తిరుమలాయపాలెం
నల్గొండ దామరచర్ల, నేరేడుగొమ్ము
సూర్యాపేట చివ్వెంల, పాలకీడు
మంచిర్యాల భీమారం, కాసిపేట, కోటపల్లి,మందమర్రి, నెన్నెల
ఆదిలాబాద్ బజార్​హత్నూర్, మావల, నేరడిగొండ, సాత్నాల, సొనాల, సిరికొండ
భూపాలపల్లి మహాముత్తారం, పలిమెల
మహ బూబాబాద్ కేసముద్రం, కురవి, ఇనుగుర్తి,సీరోలు, డోర్నకల్, మరిపెడ
ఆసిఫాబాద్ బెజ్జూర్
నాగర్ కర్నూల్ అచ్చంపేట
రంగారెడ్డి ఆమనగల్లు
Follow Us