/rtv/media/media_files/2026/01/27/fotojet-37-2026-01-27-21-14-28.jpg)
KCR Phone Tapping Case
Phone tapping case : రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలు, అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలాలతో ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. ముఖ్యంగా గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఈ కేసులో వినబడటం, దర్యాప్తు అధికారులు ఆయన పాత్రపై ఆరా తీస్తుండటం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
ఇప్పటికే వరుసగా హరీష్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావులను విచారించిన సిట్ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. అరెస్టయిన మాజీ పోలీస్ అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్లలో "పైస్థాయి ఆదేశాల మేరకు" మాత్రమే తాము పనిచేశామని పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ "పైస్థాయి" అంటే నేరుగా సీఎం కార్యాలయం లేదా కేసీఆర్ సన్నిహితులేనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీంతో తదుపరి విచారణ కేసీఆర్ చుట్టూనే తిరగబోతోందంటూ జరుగుతున్న ప్రచారం అటు బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేపుతుండగా, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కీలక నేతలు, వ్యాపారవేత్తలు మరియు సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు మొదలైంది. ఇప్పటికే ప్రణీత్ రావు, దుగ్గాల ప్రశాంత్ రావు, తిరుపతన్న వంటి కీలక పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. వీరి విచారణలో వెలుగు చూస్తున్న అంశాలే ఇప్పుడు గులాబీ బాటమ్ లైన్‌కు సెగ తగిలేలా చేస్తున్నాయి. సాధారణంగా ఇంటెలిజెన్స్ విభాగం నేరుగా ముఖ్యమంత్రికి నివేదిస్తుంది. కాబట్టి, ఇంత పెద్ద స్థాయిలో ట్యాపింగ్ జరిగితే అది సీఎం కార్యాలయానికి తెలియకుండా జరిగే అవకాశం లేదని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
ఓవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, మూలాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటే.. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్య అని, మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ పేరును వాడుతున్నారని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ ఆరోపణల ఆధారంగానే సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో నెక్ట్స్ కేసీఆర్ అనే నినాదం బాగా వినిపిస్తుంది. ఒకవేళ దర్యాప్తు సంస్థలు కేసీఆర్ వరకు వెళ్లాలని నిర్ణయించుకుంటే, అది కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పెద్ద సంచలనం అవుతుంది.
మొదట విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ట్యాపింగ్ అనేది ప్రైవసీకి భంగం కలిగించే అంశం కాబట్టి, కేంద్ర చట్టాల ప్రకారం శిక్షలు కఠినంగా ఉంటాయి. ఈ కేసు వల్ల బీఆర్ఎస్ పార్టీ కేడర్‌లో కొంత నైతిక దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కేసీఆర్ పేరు వినిపిస్తున్నప్పటికీ, ఇంకా అధికారికంగా ఆయనకు ఎలాంటి నోటీసులు అందలేదు. దర్యాప్తు అధికారులు సేకరించే ఆధారాల బట్టే ఇది "కేవలం ప్రచారమా?" లేక "నోటీసుల వరకు వెళ్తుందా?" అనేది తెలుస్తుంది.
Follow Us