/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t120535404-2025-12-04-12-06-49.jpg)
Monkey Panchayat in Sarpanch elections... Catch the monkeys... Vote
Panchayat Elections : కొద్దిరోజుల్లో తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండువిడదల నామినేషన్లు సైతం ముగిశాయి. మూడోదశ నామినేషన్లు రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి పంచాయతీ​ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ‘కోతుల తిప్పలు’ తప్పేలా లేవు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని, డ్రైనేజీలు కడ్తామని, డ్రింకింగ్​వాటర్ ఇస్తామని.. గతంలో ఓట్లు అడిగేవారు. జనం సైతం ఇలాంటి హామీలే కోరుకునేవారు. కానీ ఈసారి గ్రామాల్లో సీన్​మరోలా ఉంది.
రోడ్లు, డ్రైనేజీల సంగతేమో గానీ.. కోతుల బెడదను తీర్చే వారికే ఓట్లేస్తామని జనం అంటున్నారు. కొంతమంది అభ్యర్థులైతే దాన్నే తమ ప్రచారాస్త్రాంగా మలుచుకుంటున్నారు. తమను గెలిపిస్తే కోతుల బెడద లేకుండా చేస్తామని కొంతమంది అభ్యర్థులు ప్రచారం చేస్తుంటే..కోతుల లేకుండా చేసినవారికే మా ఓటు వేస్తామని కొన్ని గ్రామాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఒకరు కొండముచ్చుతో ప్రచారం చేయగా, మరోచోట ఇద్దరు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలతో ప్రచారం చేయించారు. తమను గెలిపిస్తే.. కోతులు లేని గ్రామాలను తయారు చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు.
ప్రతి ఏడాది కోతుల పట్టిస్తా..
దాట్ల : మహబూబాబాద్ జిల్లా దాట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమ్మినేని రాములమ్మ కోతుల బెడద నుంచి విముక్తి కలిపిస్తానని ఓటు అడుగుతుంది. 25 ఏండ్ల నుంచి మన గ్రామంలో కోతులు పట్టిన దాఖలాలు లేవని. తనను గెలిపిస్తే ప్రతి సంవత్సరం కోతులను పట్టించి దూర ప్రాంతాలకు తరలిస్తానని హామి ఇస్తోంది రాములమ్మ.
చింపాంజీ, ఎలుగుబంటి వేషంతో ప్రచారం
కమలాపూర్: హనుమకొండ జిల్లా నేరెళ్ల పంచాయతీలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో తమను గెలిపిస్తే కోతుల బెడద నివారణకు కృషి చేస్తామంటూ సర్పంచ్ అభ్యర్థులు జెట్టి నాగలక్ష్మి, గోల్కొండ శ్రీరాం అనుచరులు చింపాంజీ, ఎలుగు బంటి వేషధారణ వేసి గ్రామంలో వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా కోతులను వెంబడించి వాటిని ఊరి బయటకు తరుముతున్నారు.
కొండముచ్చుతో ప్రచారం
దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్న రాజేశ్వర్ బుధవారం కొండముచ్చుతో ప్రచారం చేశాడు. గ్రామంలో దానిని తిప్పుతూ కోతుల బెడద తీర్చేందుకు కొండముచ్చును తీసుకొచ్చానని, ఓటు తనకే వేయాలని కోరాడు. గెలిచిన తర్వాత మరో మూడింటిని తీసుకొచ్చి కోతులను తరిమేస్తానని హామీ ఇచ్చాడు.
కోతులను తరమండి చాలు...ఓటు మీకే..
ఇల్లంద: వరంగల్‌లోని ఈ గ్రామంలో మాత్రం ఓ వింత సమస్య ఆశావహులకు గండంలా మారింది. ఊరంతా ఒకే మాట.. అందరిదీ ఒక్కటే సమస్య. అదే కోతుల బెడద. గ్రామానికి ఇంకే పనీ చేయకపోయినా పర్వాలేదు. కోతుల బెడద తీర్చేస్తే చాలు.. సర్పంచ్‌గా ఎన్నుకుంటామంటోంది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామం. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 5వేల 400 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో కోతుల సంఖ్య మాత్రం 20 వేలకు పైనే ఉంది. గతంలో ఎన్నికల సమయంలో కోతుల సమస్య తీరుస్తామంటూ ఓట్లు వేయించుకున్న నేతలు.. ఆ తర్వాత సరైన శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు మరోసారి స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో కోతుల సమస్య తీర్చాల్సిందేనంటూ ఓట్లు అడగడానికి వచ్చే ఆశావహులకు తెగేసి చెప్తున్నారు. గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. కేవలం కోతులను తరమండి చాలు.. అని అంటోంది ఇల్లంద గ్రామం.
ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణతో ప్రచారం
నేరేళ్ల : హన్మకొండ జిల్లా నేరేళ్లలో తమను ఎన్నుకుంటే కోతుల బాధ తప్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఊరికే హామీ ఇవ్వడమే కాకుండా.. తమ అనుచరులకు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ వేయించి, వాటిని తరిమేయిస్తున్నారు. తమను ఎన్నుకుంటే శాశ్వతంగా కోతుల బెడద తప్పిస్తామని చెబుతున్నారు. కాగా గ్రామస్తులు, యువకులు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. పాపం ఓట్ల కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కోతులను పట్టుకో..ఓటు తీసుకో..
దంతాలపల్లి : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో కోతులు బెడద ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానిక వ్యాపారస్తుల షాప్ లోకి ప్రవేశించి వస్తువులను పాడు చేయడంతో మనుషులపై దాడి చేస్తున్నాయి. పంచాయితీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండంతో ఎవరైతే కోతులను తీసుకెళ్లి అడవిలో వదిలేస్తారో వారికేమా ఓటు అంటూ వారు చర్చింకుంటున్నారు.
కోతులను పట్టిస్తానంటే భారీ మెజారిటీతో గెలిపించిన్రు..
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ఏలేటి మమత.. తనను సర్పంచ్​గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గ్రామంలో 4 వేల నుంచి 5 వేల కోతులు ఉండడంతో వాటి వల్ల ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడ్తున్న జనం.. మరో ఆలోచన లేకుండా మమతను భారీ మెజారిటీతో గెలిపించారు. సర్పంచ్ గా మమత గెలిచిన వెంటనే బిహార్ నుంచి ఓ స్పెషల్ టీమ్​ను రప్పించి.. రెండు నెలలు కష్టపడి సుమారు 3 వేల కోతులను పట్టించి ఉట్నూరు అడవుల్లో వదిలివేశారు. గడిచిన రెండేళ్లలో కోతుల సంతతి భారీగా పెరగడంతో మళ్లీ అదే సమస్య మొదలైంది. దీంతో ఈసారి కూడా కోతులను పట్టించేవారికే ఓటు వేస్తామని జనం చెప్తున్నారు.
కోతులను పట్టించి సర్పంచ్​ రేసులో..
మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. ప్రజలు, రైతుల ఇబ్బందులను గమనించిన గ్రామస్తుడు, కాంగ్రెస్ నాయకుడు పంజా మహేందర్ ఒక్కో కోతికి రూ.500 చొప్పున చెల్లించి ఏకంగా 600 కోతులను పట్టించి.. దూర ప్రాంతాల్లో వదిలేయించాడు. ఇందుకోసం రూ.3.5 లక్షలు ఖర్చు చేశాడు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. రిజర్వేషన్ అనుకూలంగా వచ్చి గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు సహకరిస్తే సర్పంచ్ బరిలో ఉంటానని చెబుతున్నాడు పంజా మహేందర్.
కోతుల పట్టించిన ఓటెయ్యండి
అలాగే మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన వాంకుడోత్ కొమ్మలు నాయక్ కోతుల బెడద నివారించేందుకు రూ.8 లక్షలు ఖర్చు చేశాడు. ఏపీలోని చిత్తూరు నుంచి కోతులను పట్టేవారిని రప్పించి, సుమారు 200 కోతులకు పైగా పట్టించి, దూరప్రాంతాల్లో వదిలేసి వచ్చాడు. ప్రస్తుతం రిజర్వేషన్​కలిసి వస్తే ఆయన సర్పంచ్​ఎన్నికల్లో పోటీచేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
కోతులు, కుక్కల బెడద తొలగిస్తేనే ఓటు
మెదక్ జిల్లా మండల కేంద్రం వెల్దుర్తిలో గత కొన్నేళ్లుగా కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా పంచాయ తీ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో కో తులు, కుక్కల బెడద తొలగించిన అభ్యర్థులకే తాము మద్దతు ఇస్తామని సోషల్ మీడియా ద్వారా యువకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందే వానరాలు, గ్రామ సింహాల బెడద తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీలు, ఇండిపెండెంట్ అనే తేడా లేకుండా సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చిన వారినే గెలిపిస్తామని చెబుతున్నారు.
Follow Us