Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోలో వర్గీకరణకు అనుకూలమని చెప్పి తీర్మాణం చేసిన ఆయన ఇప్పుడు వర్గీకరణను అడ్డకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాదిగలకు హామీ ఇచ్చి ఓట్లు కొల్లగొట్టి మోసం చేశారన్నారు. రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న చేతలకు సంబంధం లేదంటూ RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు..
ఈ మేరకు సుప్రీం కోర్టు వర్గీకరణ జరుగుతుందని తీర్పు ఇవ్వగానే స్వాగతించిన రేవంత్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ‘ఎమ్మార్సీఎస్ మళ్లీ రోడ్డెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ మాటలు మాత్రమే తీయ్యగుంటాయి. ఆయన తేనే పూసిన కత్తిలాంటివాడు. నిండు శాసనసభలో సుప్రీం తీర్పును స్వాగతించింది మొదట ఆయనే. సుప్రీం జడ్జీలను అభినందించారు. మొదటగా తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ వర్తించేలా జీవో తీసుకొస్తామన్నారు. కానీ రెండు నెలల్లోనే ప్లేట్ మార్చేశారని మండిపడ్డారు.
మల్లిఖార్జున్ ఖర్గే దళిత జాతి ద్రోహి..
ఎమ్మార్పీఎస్ ధర్నాల్లో పాల్గొని వర్గీకరణ జరగాలని మద్దతు ఇచ్చిన రేవంత్ ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నాడంటూ మందకృష్ణ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తమ సభలకు వచ్చి సపోర్టు చేసిన వ్యక్తిని నమ్మకుండా ఎలా ఉంటామన్న మందకృష్ణ.. ముఖ్యమంత్రి నిజాయితిగా లేడని చెప్పారు. ఇక మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలం కాదన్నారు. ఆయన మాటలు వేరు ఆచరణ వేరని అన్నారు. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ డిక్లరేషన్ ను ఖర్గే మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయారని చెప్పారు. ఖర్గే దళిత జాతి ద్రోహి అన్నారు.
రాహుల్ గాంధీ సైతం ఇదే మాట..
కాంగ్రెస్ వేసిన జస్టీస్ సదాశివన్ కమిషన్ రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. కానీ కాంగ్రెస్ దీనిని విస్మరిస్తుందన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా స్వాగతించారు. కానీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సైతం వర్గీకరణ చేస్తామని గద్వాల్ సభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా మొత్తంగా ఎక్కడో కుట్ర జరుగుతోందని, పదవికోసం రేవంత్ కుట్రకు తెరలేపుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఆయన న్యాయం వైపు లేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం వీడియోలో చూడండి.