జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతుండగా.. తెలంగాణ నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు ఆయనను పలకరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందోనని అన్నారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి తనకు ఇష్టమైన పాట అని గుర్తు చేశారు. తెలంగాణ పోరాటాల గడ్డ అని అన్నారు. అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతీ నెల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాట నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు.
బీజేపీ బందిపోటు ముఠా అంటూ రేవంత్ విమర్శలు..
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా.. మోదీ, అదానీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ నుంచి ప్రధాని, అదానీ ముంబైను దోచుకోవడానికి వస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని మహారాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ వెన్నుపోటు రాజకీయాలతో ప్రతిపక్ష ప్రభుత్వాలపై కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అలాంటి బీజేపీని ఈ ఎన్నికల్లో పాతిపెట్టాలని పిలుపునిచ్చారు.