సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తెలుగు సినీ ఇండస్ట్రీ ముక్త కంఠంతో ఖండించింది. న్యాయపోరాటానికి సిద్ధమైన నాగార్జున కోర్టును సైతం ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే.. కేటీఆర్ ఈ వ్యాఖ్యలపై పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం చర్చనీయాంశమైంది. కొండా సురేఖ కామెంట్ల తర్వాత ట్విట్టర్‌లో స్పందించారు కేటీఆర్. ''మూసి మురికి అంతా వాళ్ల నోట్లోనే.. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?'' అంటూ పోస్టు చేశారు. సురేఖకు పంపించిన లీగల్ నోటీసులను షేర్ చేశారు. ఈ ఆరోపణలపై మూడు నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో తాను ఇచ్చిన సమాధారాన్ని సైతం మరో పోస్టులో షేర్ చేశారు కేటీఆర్. అనంతరం ఈ విషయంపై మళ్లీ స్పందించలేదు. మీడియాతో కూడా మాట్లాడలేదు.
తొలుత ధర్నా చేస్తారని ప్రచారం..
కొండా సురేఖ వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ తొలుత గాంధీ భవన్ దగ్గర ధర్నా చేస్తారని ప్రచారం సాగింది. అయితే.. ఏమైందో తెలియదు కానీ అది జరగలేదు. పార్టీ నేతలు సైతం భారీ ఆందోళనలకు సిద్ధం అవుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా అలాంటి జరగలేదు. అయితే.. కేటీఆర్ ఈ విషయంపై మీడియా ముందుకు రాకపోవడంపై పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మాటకు మాటతో వివాదాన్ని పెద్దది చేయకూడదని ఆయన భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
సురేఖపై కాంగ్రెస్ సీరియస్..
ఇదిలా ఉంటే.. సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. సురేఖ వ్యాఖ్యలతో భారీగా నష్టం జరిగిందని.. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి అగ్రనాయకత్వం సమాచారం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.