Kishan Reddy: హైదరాబాద్ మజ్లిస్ నేతలపై కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మజ్లిస్ ఏరియాలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లి డివిజన్‌లోని డీ-క్లాస్‌లో కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేక ఏండ్లుగా మజ్లిస్ నేతలు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నా సామాన్యులకు ఎలాంటి పథకాలు అందడం లేదన్నారు.
ప్రజలకు అన్యాయం చేస్తున్నారు..
మజ్లిస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పక్షపాతంతో వ్యవహరిస్తూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతగా నాంపల్లి నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేలా అనేక పనులు చేస్తున్నాం. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ల సాయంతో సుమారు రూ.78 లక్షలతో కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ జిమ్స్, బోర్ వెల్స్ వంటి అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం. బస్తీ నాయకులు, ప్రజలు మజ్లిస్ నేతలు వ్యవహరిస్తున్న తీరును గమనించాలి. ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఆలోచన చేయాలి. నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి అభివృద్ధికి సహకరించాలని ఆయన అన్నారు.