ఖమ్మం మున్నేరు ప్రజలను మరో సమస్య వేధిస్తోంది. ఇటీవలే భారీ వర్షాలు, వరదల కారణంగా అల్లకల్లోలమైన జనాలు.. ఇప్పుడు మున్నేరులో హానికర రసాయనాల డంపింగ్ కారణంగా తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మున్నేరు ఒడ్డున కొంత స్థలాన్ని లీజుకు తీసుకుని భారీ ట్యాంకర్ల ద్వారా నిత్యం హానికర రసాయనాలను నీటిలోకి వదులుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీజుకు తీసుకున్న ప్రదేశంలోని భూగర్భంలో భారీ పైపులు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా రసాయనాలను మున్నేరులోకి వదులుతున్నారని వాపోతున్నారు. రసాయనాల కలయికతో రియాక్షన్ కారణంగా చేపలు, గొర్రెలు, పశువులు మృత్యువాత పడుతున్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్ నుంచి గుంటూరుకు సరఫరా..
ఈ మేరకు మున్నేరు దిగువ ప్రాంతాలైన గుదిమళ్ల, నంద్యాతండా, పండ్రేగుపల్లి, కోదండరాంపురం, కొత్తూరు గ్రామస్థులకు చర్మవ్యాధుల బారిన పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలకాలుష్యం కారణంగా చేపల మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఆగస్టులోనూ గుదిమళ్ల వద్థ మున్నేరులో కలుస్తున్న రసాయనాల ప్రదేశాన్ని గుర్తించిన మత్స్యకారులు, స్థానికులు.. కాపుకాసి నిందితులను పోలీసులకు పట్టించారు. పట్టుబడిన వ్యక్తుల వద్ద రికవరీ మిథనాల్ వేబిల్ ను గుర్తించి ను హైదరాబాద్ నుంచి గుంటూరుకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే దీనిపై కేసునమోదు చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోకుండానే పోలీసులు చేతులు దులుపుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో మరోసారి ఖమ్మం రూరల్ పోలీసులు గురువారం రాత్రి కాపుకాసి రసాయనాలను వదిలేందుకు వచ్చిన వాహనాలను పట్టుకున్నారు. కెమికల్ ట్యాంకర్ ను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మున్నేరులో రసాయనాల వదలివేతపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.