కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో తనకు తక్కువ ఓట్లు వచ్చేలా ప్రయత్నించారన్నారు. ఎక్కడా లేని సమస్యలు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే వస్తున్నాయన్నారు. పార్టీ కోసం పని చేసిన వాళ్లకు నిధులు ఇస్తున్నామన్నారు. కొందరు గిరిగీసుకుని వర్గాలను ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీలో వర్గాలు ఉండవని.. వర్గాలను ప్రోత్సహిస్తే సహించబోం అని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు వస్తాయన్నారు.
అయితే.. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ బండి ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు నాటి నుంచి ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నాయి. బండి పదవి పోవడానికి ఈటలే కారణమన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈటల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా బండి సంజయ్ చక్రం తిప్పాడని టాక్ ఉంది. ఈ క్రమంలో తాజాగా బండి సంజయ్ ఈటల టార్గెట్ గా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.