/rtv/media/media_files/2026/01/26/si-madhu-2026-01-26-07-46-25.jpg)
మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అన్న భయంతో ఓ వ్యక్తి సృష్టించిన బీభత్సం యాచారంలో కలకలం రేపింది. పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో, ఏకంగా విధి నిర్వహణలో ఉన్న సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రాణాలనే పణంగా పెట్టాడు. ఎస్‌ఐ కారు బోనెట్‌పై ఉన్నాడని కూడా చూడకుండా సుమారు అర కిలోమీటరు దూరం అత్యంత వేగంగా కారును పోనిచ్చి అందరినీ భయాందోళనకు గురిచేశాడు.
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం ఎస్‌ఐ మధు తన సిబ్బందితో కలిసి స్థానిక బస్టాండ్ సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారును ఆపాల్సిందిగా పోలీసులు సంకేతాలు ఇచ్చారు. అయితే, కారు డ్రైవర్ పోలీసులను బేఖాతరు చేస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా, ఎస్‌ఐ మధు కారును అడ్డుకునే క్రమంలో బోనెట్‌పైకి దూకారు. నిందితుడు కారు ఆపకపోగా, ఎస్‌ఐ బోనెట్‌పై ఉండగానే వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు.
ఈ క్రమంలో కారు డ్రైవర్ పారిపోయే ప్రయత్నంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వెంకట్‌రెడ్డి, ఆయన కోడలు దివ్య, వారి ఏడాది వయసున్న మనవడిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్నవారు కిందపడిపోగా, దివ్య చేయి విరిగింది. వెంకట్‌రెడ్డి, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. పట్టణం దాటిన తర్వాత కారు వేగం కాస్త తగ్గడంతో ఎస్‌ఐ మధు చాకచక్యంగా బోనెట్ మీద నుండి రోడ్డు పక్కకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఆయనకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
అప్రమత్తమైన పోలీసులు
వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని వెంబడించి ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోహెడకు చెందిన శ్రీకర్‌గా గుర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా అతను మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. కారులో శ్రీకర్‌తో పాటు అతని స్నేహితుడు నితిన్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడికి ప్రయత్నించడం, అమాయక ప్రయాణికులను గాయపరచడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us