హైదరాబాద్‌లో అక్రమ ఆస్తులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇటీవల ఎన్ కన్వెన్షన్ సెంటర్‌తో పాటు అనేక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది హైడ్రా. అయితే.. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో జీహెచ్ఎంసీతో పాటు పోలీసులు ఆ విధుల్లో నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ వేడుకలు ముగియడంతో మళ్లీ కూల్చివేతలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా లేక్ వ్యూ పేరిట జరిగిన నిర్మాణాలపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో లేక్ వ్యూ ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఉండేది. ఏదైనా చెరువు దగ్గర అపార్ట్‌మెంట్ అవుతుందంటే వ్యూ కోసం కొనేందుకు పోటీ పడేవారు. అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు సైతం చెరువులు, ఇతర జలవనరులకు సమీపాల్లో చేపట్టారు. కొత్తగా కూడా కొన్ని పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా చెరువులకు దగ్గరా జరిగిన, జరుగుతున్న ప్రాజెక్టులపై హైడ్రా ఫోకస్ పెట్టింది.
విచారణ ప్రారంభం..
లేక్ వ్యూతో ఉన్న అపార్ట్‌మెంట్‌ల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి హైడ్రా విచారణ చేపట్టింది. చెరువులోని కొంత స్థలం ఆక్రమించినట్లు విచారణలో తేలితే ఆధారాలతో కూల్చడానికి సిద్ధంగా ఉంది. అయితే చాలా మంది నిర్మాణదారులు తాము ఎలాంటి ఆక్రమణలు చేయలేదని చెబుతున్నారు. తాము అన్ని నిబంధనలు పాటించే లేక్ వ్యూ అపార్ట్‌మెంట్ లు నిర్మించామని వారు అంటున్నారు. విచారణ తర్వాతనే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో ఇంకా కొన్ని భవనాలు కూల్చివేతలు జరిగే అవకాశం ఉందని హైడ్రా అధికారులు తెలిపారు.
చెరువుకు ఆనుకుని ఉన్న నిర్మించిన అపార్ట్‌మెంట్లలో అక్రమణ జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇలా లేక్ వ్యూ అపార్ట్‌మెంట్ అని తొందరపడి కొనుగోలు చేయవద్దని.. పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలో అనేక చరువుల్లో ఆక్రమణలు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణాలు జరిగాయని హైడ్రా వద్ద సమాచారం ఉందని తెలుస్తోంది. దీంతో ఎప్పటి నుంచో ఉన్న చెరువుల వివరాలను సేకరిస్తోంది.