Hyderabad: హైదరాబాద్ లో చాలా చోట్ల హైడ్రా (Hydra) కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కూకట్‌పల్లి పరిధిలోని యాదవ బస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ (Buchchamma) అనే మహిళ హైడ్రా భయంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శివయ్య, బుచ్చమ్మ దంపతులు తమ ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి, కట్నంగా తలో ఇంటిని కానుకగా ఇచ్చారు.
అయితే, చెరువుల ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ విషయం తెలిసి తమ కూతుళ్లకు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తారనే మనస్తాపంతో తల్లి బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
'హైడ్రా' కమిషనర్ రంగనాథ్..ఏమన్నారంటే..!
ఈ ఘటనపై హైడ్రా(Hydra) కమిషనర్ రంగనాథ్ (Ranganath) స్పందించారు. బుచ్చమ్మ బలవన్మరణంపై కూకట్‌పల్లి పోలీసులతో మాట్లాడినట్లు తెలిపారు. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో బుచ్చమ్మ కూతుర్లు ఆమెను ఈ విషయం గురించి నిలదీశారు. దాంతో బుచ్చమ్మ తీవ్ర ఆవేదన చెందింది. తన కూతుళ్ల ఇళ్లను కూడా ఎక్కడ కూల్చివేస్తారో అనే భయంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు అని తెలియజేశారు.
హైడ్రా ఎవరికి నోటీసులు ఇవ్వలేదన్న రంగనాథ్.. శివయ్య దంపతులు తమ కూతుళ్లకు ఇచ్చిన ఇళ్లు కూకట్‌పల్లి (Kukatpally) చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ అవి ఎఫ్‌టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయని వివరించారు. ఇక కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదని ఆయన వివరించారు.
మూసీ నదిలో శనివారం భారీగా ఇళ్లను హైడ్రా కూల్చివేయబోతున్నట్లు ఓ అసత్య ప్రచారం జరుగుతోంది. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ఒక ఎజెండాతో హైడ్రాపై నకిలీ వార్తలను (Fake News) ప్రచారం చేస్తున్నాయని రంగనాథ్ మండిపడ్డారు. కూల్చివేతల గురించి ప్రజలు అనవసర భయాలు పెట్టుకోవద్దన్నారు. కూల్చివేతల వల్ల పేదలు, మధ్యతరగతి వారు ఇబ్బందులు పడకుండా హైడ్రాకు ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసిందని వివరించారు.
Also Read: విద్యార్థుల కోసం కొత్త పథకం..సీఎం రేవంత్ కీలక ప్రకటన!