మూసీ పక్కన నిర్మాణాలను ముట్టుకోం.. టెన్షన్ వద్దు.. హైడ్రా చీఫ్ సంచలన ప్రకటన!

మూసీ పక్కన నిర్మాణాలను ముట్టుకోమని హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. సామరస్య పూర్వకంగా పునరావాసం చేసిన తర్వాతనే కూల్చివేతల జోలికి వెళ్తామని స్పష్టం చేశారు. పునరావాసానికి ప్రణాళిక రూపొందించడానికే మార్కింగ్ చేస్తున్నట్లు చెప్పారు.

New Update

హైడ్రా (HYDRA) కూల్చివేతల అంశం రోజు రోజుకూ వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా మూసీ (MUSI Rever) పరివాహక ప్రాంతంలో అధికారులు చేపట్టిన సర్వే కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల సర్వేను అనేక చోట్ల అడ్డుకుంటున్నారు. మార్కింగ్ సైతం వేయనీయడం లేదు. ఒక వేళ వేసినా.. దానిపై రంగులు వేసి నిరసన తెలుపుతున్నారు. మూసీ వెంట నివాసాలు ఏర్పరుచుకున్న వారు కొందరు ప్రభుత్వం డబుల్ బెడ్రూం అందిస్తే తాము ఇక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమని ప్రకటిస్తుండగా.. ఏళ్ల క్రితమే శాశ్వత నివాసాలు కట్టుకున్న వారు.. స్థలాలు కొనుక్కొని అన్ని ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు కట్టుకున్న వారు మాత్రం తాము ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చి చెబుతున్నారు. జీవితాంతం కష్టపడి ఇళ్లు కొనుక్కుంటే/కట్టుకుంటే ఇప్పుడు వచ్చి వెళ్లమంటే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూం ఇళ్లు తమకు అవసరమే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. తమ ఇళ్లను ముట్టుకోవద్దని వారు తేల్చిచెబుతున్నారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈటల రాజేందర్ లాంటి నాయకులు సైతం బాధితుల తరఫున ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజు పలువురు బాధితులు తెలంగాణ భవన్ కు వెళ్లి బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 

మార్కింగ్ అందుకే..

ఇదిలా ఉంటే.. కూల్చివేతలపై హైడ్రా వెర్షన్ మాత్రం మరోలా ఉంది. తాము మూసి పరివాహక ప్రాంతంలో ఇప్పుడు ఎలాంటి కూల్చివేతలు చేయమని స్పష్టం చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇదే విషయాన్ని నిన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం తెలిపారు. తాను హైడ్రా చీఫ్‌ తో మాట్లాడానని వెల్లడించారు. 'ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ పరివాహక ప్రాంతంలో తాము ఎలాంటి కూల్చివేతలు చేపట్టం. సామరస్య పూర్వకంగా పునరావాసం చేసిన తర్వాతనే కూల్చివేతల జోలికి వెళ్తాం.. పునరావాసానికి ప్రణాళిక రూపొందించడానికే మార్కింగ్ చేస్తున్నాం' అని రంగనాథ్ తనకు చెప్పినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ తన యూట్యూబ్ చానల్ ద్వారా తెలిపారు. 

అయితే.. ముందుగా స్వచ్ఛందంగా మూసీ పరివాహక ప్రాంతం నుంచి వెళ్లే వారిని గుర్తించాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అనంతరం మిగతా వారిపై దృష్టి సారించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అవసరం అయితే.. పరిహారం కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. చైతన్యపురి, సత్యానగర్, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో అనేక మంది 50, 60 ఏళ్ల క్రితమే ఇక్కడ స్థలాలు కొని ఇల్లు కట్టుకున్నారు.

అన్ని రకాల అనుమతులతో ఇక్కడ రెండు, మూడు అంతస్తుల భవనాలను కట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఈ భవనాల ధర కోట్లు పలుకుతోంది. ఇంత పరిహారం ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. తమ కోట్ల విలువ చేసే భవనాలను కూల్చి ఊరి చివరలో డబల్ బెడ్రూం ఇస్తే ఊరుకునేదే లేదని వీరంతా ఇప్పుడు తేల్చి చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందన్న అంశం ఉత్కంఠగా మారింది.

#hydra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe