అక్రమ నిర్మాణాలు చేసిన పెద్ద తలలను వదలి పెట్టేది లేదని హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. అందుకు బ్యాగ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోందన్నారు.
తాము సైలెంట్‌గా ఉన్నామంటే సునామీ రాబోతోందని అర్థమన్నారు. చెరువులు కబ్జా చేసి ఫాంహౌస్‌లు నిర్మాణాలు చేపట్టిన వారిపై సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని తేల్చి చెప్పారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన రంగనాథ్.. కేటీఆర్ సన్నిహితుడిగా చెబుతున్న జన్వాడ ఫామ్ హౌజ్ పై సైతం స్పందించారు. ఆ ఫామ్ హౌజ్ హైడ్రా పరిధిలోకి రాదన్నారు. జన్వాడ 111 జీవో పరిధిలోకి వస్తుందన్నారు. జన్వాడలో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
హైడ్రాపై అసత్య ఆరోపణలు
హైడ్రాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యమని స్పష్టం చేశారు. హైడ్రా అంటే బూచి కాదు.. భరోసా ఇచ్చే సంస్థ అని అన్నారు. తాము కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవన్నారు. కొందరి తప్పుడు ప్రచారం వల్ల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణల్లో పేదలు ఉంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదన్నారు. అక్రమ కట్టడాల వెనుక కొందరు బలవంతులు ఉన్నారన్నారు. తప్పులు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు.