ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు, డైరెక్టర్ ఆర్‌పీ పట్నాయక్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న తన కొడుకు వైష్ణవ్‌ను శ్యామ్ అనే విద్యార్థి ర్యాగింగ్ చేస్తూ చెవి కొరికాడని ఆర్‌పీ పట్నాయక్ కంప్లైంట్లో పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. ఆర్పీ పట్నాయక్ కుమారుడు వైష్ణవ్ ను శ్యామ్ అనే విద్యార్థి కాలేజీలో ర్యాగింగ్ చేశాడు. అంతటితో ఆగకుండా బస్సులో వెళ్తున్నప్పుడు వైష్ణవ్‌తో గొడవకు దిగి.. చెవి కొరికాడు. ఈ విషయాన్ని వైష్ణవ్ తన తండ్రి ఆర్‌పీ పట్నాయక్‌కి చెప్పాడు. దీంతో ఆర్పీ పట్నాయక్ నిన్న రాత్రి రాయదుర్గం పోలీసు స్టేషన్ కు వెళ్లి ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్పీ పట్నాయక్ విషయానికి వస్తే.. నీకోసం చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనంతరం చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే తదితర సూపర్ హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం కొన్ని చిత్రాలకు డైరెక్షన్ కూడా చేశారు. పలు మ్యూజిక్ షోలకు ఆయన న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. వివాదాలకు దూరంగా ఉండే ఆర్పీ పట్నాయక్ తాజాగా కుమారుడి విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.