Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి చిరుత కలకలం రేపింది. మంచిరేవుల EIPL రివర్ ఎడ్జ్ విల్లాస్ పక్కన ఉన్న ఒక కొండపై చిరుత కనిపించడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. 8 సీసీ కెమెరాలతో మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో చిరుత కోసం వేట కొనసాగించగా.. చివరికి మూడోరోజు సీసీ కెమెరాలకు చిక్కింది. నార్సింగి దగ్గర మంచిరేవుల గ్రే హౌండ్స్ క్యాంపస్‌లో చిరుత సంచారం చేస్తూ కనిపించింది. దీంతో చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులుతగిన ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలోని పలు చోట్ల 4 బోన్లు, 4 మేకలు.. 8 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పటివరకు ఆ చిరుత పులి ఏ బోన్లోకి రాలేదు. ఒక్కసారిగా చిరుత సంచారంతో అక్కడి విల్లాస్ లో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.
గతంలోనూ..
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోకి వ్య్వప్రాణులు ప్రవేశించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో శంషాబాద్, గండిపేట, శామీర్ పేట, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఎల్బీనగర్, మియాపూర్, ఐక్రిసాట్ వంటి ప్రాంతాలలో చిరుతపులులు కనిపించిన ఘటనలు వెలుగుచూశాయి. గతేడాది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దాదాపు ఆరు రోజుల పాటు చేతికి దొరక్కుండా అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది చిరుత.
Also Read: Hari Hara Veera Mallu: థియేటర్ వద్ద పిడిగుద్దులతో తనుకున్న పవన్ ఫ్యాన్స్! వీడియో వైరల్
చిరుత సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు శివారు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఒంటరిగా బయట తిరగవద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. చిరుతలను పట్టుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసి, వాటిని పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ లేదా పోలీసులకు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు.