Musi Demolitions: 'మూసీ'లో అసలేం ఏం జరుగుతోంది.. అంతా ఆగమాగం.. గందరగోళం!

మూసీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇందు కోసం ఎంత మేర భూసేకరణ చేస్తారు? బాధితులకు పరిహారం పెంచుతారా? పెంచితే ఏ ప్రాతిపదికన పెంచుతారు? అసలు కూల్చేది హైడ్రానా? జీహెచ్ఎంసీనా? అన్న అంశంపై తీవ్ర గందగరగోళం నెలకొంది.

New Update

మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల అంశం రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఓ వైపు బాధితుల ఆందోళనలు, మరో వైపు ప్రతిపక్షాల నిరసనలు, ఇంకో వైపు హైకోర్టులో విచారణతో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. అయితే.. ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న చర్చ సాగుతోంది. సామరస్యపూర్వకంగా నిర్వాసితులను ఒప్పించిన తర్వాతనే కూల్చివేతలు ఉంటాయని అధికారులు చెబుతుండగా.. క్షేత్ర స్థాయిలో మార్కింగ్ కు వెళ్లిన సిబ్బంది మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారన్న వార్తలు వస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో కూల్చివేతలు ఉంటాయన్నట్లుగా వారు ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధితుల ఆందోళనకు ఇదే కారణమని తెలుస్తోంది.

అసలేం చేస్తారు?

మరో వైపు ప్రభుత్వం కూడా తాము మూసీ చుట్టూ ఏం చేయబోతుందనే అంశంపై క్లారిటీ ఇవ్వకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డవలప్మెంట్ ద్వారా ఏఏ కార్యక్రమాలను చేపడుతారు? ఎలాంటి నిర్మాణాలు చేస్తారు? మూసీకి ఇరు వైపులా ఎంత వరకు నిర్మాణాలను తొలగిస్తారు? ఆ అభివృద్ధిలో నిర్వాసితులకు ఏమైనా భాగస్వామ్యం కల్పిస్తారా? అన్న అంశంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. మూసీ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి డీపీఆర్ ను సైతం ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఇవన్నీ గందరగోళానికి దారి తీశాయన్న చర్చ సాగుతోంది.

మూసీ కూల్చివేతలు చేసేదెవరు?

మొన్నటి వరకు మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలను హైడ్రాకు అప్పగించారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇందుకు సైతం పెద్ద పెద్ద మిషన్లను సైతం హైడ్రా అధికారులు సమకూర్చుకుంటున్నారన్న వార్తలు వచ్చాయి. మీడియా, సోషల్ మీడియా కథనాలు, ప్రతిపక్షాల విమర్శలు అన్నీ హైడ్రా చుట్టూనే సాగాయి. కానీ నిన్న సడన్ గా హైడ్రా విడుదల చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మూసీ కూల్చివేతలకు తమకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా కమిషనర్ పేరు మీద ప్రకటన రావడంపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా ఉందన్న అభిప్రాయం హైడ్రా ప్రకటనతో వ్యక్తం అవుతోంది.

పరిహారం ఎంత? ఎలా?

మూసీ పరివాహక ప్రాంతాల్లో మూడు రకాల నిర్మాణలు ఉన్నాయి. మూసీ రివర్ బెడ్, బఫర్, ఎఫ్టీఎల్ ఇలా మూడు ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే.. ఇందులో మూసీ రివర్ బెడ్ లో నిర్మించుకున్న వారిలో మెజార్టీ కుటుంబాలు ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నాయి. మరికొందరు మాత్రం తాము వెళ్లమని స్పష్టం చేస్తున్నారు. వీరి విషయం పక్కన పెడితే.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేసుకున్న వారికి పరిహారం ఎలా ఇస్తారనే అంశంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. వీరంతా స్థలాలు కొనుక్కుని, ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులతో నిర్మాణాలు చేసుకున్నారు. దీంతో తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లును వదిలి వెళ్లడానికి వారు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం తీరుపై వీరు భగ్గుమంటున్నారు. మీరే (ప్రభుత్వమే) అనుమతి ఇచ్చి.. మీరే అక్రమం అంటారా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితాంతం కష్టపడి కట్టుకున్న గూడును ఎలా నేలమట్టం చేస్తారంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. 

బ్యాంక్ లోన్ల పరిస్థితి ఏంటి?

ఇప్పటి వరకు ఇక్కడ ఒకో ఇళ్లు ధర రూ.50 లక్షల నుంచి కోట్ల వరకు కూడా పలికింది. అనేక మందికి బ్యాంక్ లు లోన్లు కూడా ఇచ్చాయి. అయితే.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటే వీరు ఖాళీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. వీరికి పరిహారం పెంచే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అయితే.. ఎంత పెంచుతారు? ఏ ప్రాతిపదికన పెంచుతారు? బ్యాంక్ లోన్ల పరిస్థితి ఏంటి? అన్న అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇది కూడా గందరగోళానికి మరో కారణంగా మారింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన, సానుకూల ప్రకటన వచ్చే వరకు ఈ గందరగోళం, ఆందోళనలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు