మూసీ నదికి ఇరువైపులా జరుగుతున్న సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్కడి నిర్వాసితులను హైడ్రా తరలించడంలేదన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అని అన్నారు. దీన్ని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతోందన్నారు. గత కొన్ని రోజులుగా మూసీ నదికి ఇరువైపులా జరుగుతున్న సర్వే వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో సర్వే చేస్తున్న అధికారులు బఫర్ జోన్, FTL, నదీ గర్భంలో చేపట్టిన నిర్మాణాలను గుర్తించి మార్కింగ్ చేస్తున్నారు.
నిలిచిన మార్కింగ్
అయితే.. అనేక చోట్ల ఈ మార్కింగ్ ను అడ్డుకుంటున్నారు. ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి.. మళ్లీ ఇప్పుడు ఈ పనులేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం మార్కింగ్ పై వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. మరో వైపు ఈ రోజు హైకోర్టు సైం హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, తీర్పులను పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టడంపై సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో హైడ్రా నెక్ట్స్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం సైతం మూసీ కూల్చివేతల విషయంలో వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. నిర్వాసితులను సంతృప్తి పరిచిన తర్వాతనే ముందుకు వెళ్లాలన్నది రేవంత్ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది.