/rtv/media/media_files/2025/01/27/1lNE3cgfnHre8pc25Os9.jpg)
Rythu Bharosa
Rythu Bharosa : రైతు భరోసా పథకం రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రారంభం కానుంది. అర్హులైన రైతులకు ఎకరాల ప్రకారం పెట్టుబడి సాయం నేటి నుంచి వారి ఖాతాల్లో నేరుగా జమ కానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. రైతుకు వ్యవసాయ పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుభరోసా, పేదల సొంతింటి కల సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్లు, రైతు కూలీలకు చేయూతనిచ్చేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు రేషన్ బియ్యం అందించేందుకు కొత్త రేషన్ కార్డులు వంటి ప్రధానమైన నాలుగు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రారంభించారు.
ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ. 6000 చొప్పున వ్యవసాయ సాయం అందించనుంది. ఎకరాల వారీగా ఖాతాల్లో నగదు జమకానుంది. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతులకు రైతుభరోసా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం ప్రభుత్వం పథకం ప్రారంభించినప్పటికీ రిపబ్లిక్ డే సెలవు దినం కావడంతో రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. సోమవారం వర్కింగ్ డే కావడంతో నేటి నుంచి రైతులకు భరోసా నిధులు అందజేయాలని అధికారులు నిర్ణయించారు.
కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు, గతంలో బ్యాంక్ ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుపడటం, ఖాతా నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలతో వేలాది మందికి రైతుబంధు సకాలంలో జమకాలేదు. దీంతో అర్హులైన వారు అన్ని రకాల బ్యాంక్ ఖాతాలను సరిచేసుకుని సంబంధిత వివరాలను వ్యవసాయ క్లస్టర్ అధికారులకు అందజేయడానికి జనవరి చివరి వరకు అవకాశం కల్పించింది. సంబంధిత వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు గతంలో వ్యవసాయేతర భూములకు సైతం రైతుబంధు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈసారి కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే రైతుభరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం గ్రామాల వారీగా సర్వే చేపట్టి వ్యవసాయేతర భూములను గుర్తించారు. ఆ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు పోర్టల్ నుంచి తొలగించారు. దీంతో కేవలం సాగవుతున్న భూములకు మాత్రమే రైతుభరోసా అందనుంది.అయితే చాలామంది వ్యవసాయేతర భూములను రైతుభరోసా నుంచి తొలగించడం మూలంగా ఆ భూమి పట్టా కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. అయితే కేవలం వ్యవసాయేతర భూమిగా పేర్కొనడం తప్ప భూమి పట్టాను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించమని అధికారులు భరోసా ఇస్తున్నారు. అదే సమయంలో ఒక రైతుకు కొంత సాగు భూమి, మరికొంత సాగు చేయని భూమి ఉంటే సంబంధిత అధికారులు ఆ తేడాను పక్కాగా గుర్తిస్తున్నారు. తద్వారా సాగుభూమికి మాత్రమే రైతుభరోసా వర్తించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఇక ప్రభుత్వం జనవరి 26 న ప్రకటించిన రైతుభరోసా ఆదివారం అర్థరాత్రి నుంచే రైతుల ఖాతాలో జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ బ్యాంకులకు సెలవుదినం కావడంతో భరోసా నిధులు జమ కాలేదు. సోమవారం నుంచి తొలి దశలో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు 10 లక్షల మంది రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అందే సూచనలు ఉన్నట్లు సమాచారం.