/rtv/media/media_files/2026/02/14/political-heat-rises-in-mahbubnagar-mayor-seat-2026-02-14-20-23-20.jpg)
Municipal Mayor elections
Municipal Elections: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు పూర్తయ్యాయి. నేడు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చైర్మన్, మేయర్ల ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అన్ని జిల్లాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 7 కార్పొరేషన్లు కాంగ్రెస్‌కే దక్కే అవకాశముంది. మరోవైపు 60కి పైగా మున్సిపాలిటీలను ఆ పార్టీ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఈ క్రమంలో హంగ్ ఏర్పడిన చోట ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. పలు మున్సిపాలిటల్లో విజయం సాధించిన ఇండిపెండెంట్లతో పాటు ఆయా పార్టీల నుంచి గెలిచిన వారిని తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేశాయి. పలు రాష్ర్టాల్లో క్యాంపులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు సంబంధిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సభ్యులు చేరుకునేలా ఆయా పార్టీల నాయకులు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఉదయం 11 గంటలకు గెలిచిన సభ్యులందరూ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే అత్యంత కీలకమైన మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మరియు వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రారంభం కానుంది.
కాగా, మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. నిబంధనల ప్రకారం, గెలిచిన కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లలో కనీసం సగం మంది (50%) హాజరైతేనే కోరం ఉన్నట్లు పరిగణించి ఎన్నికను నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ కోరం లేకపోతే, ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేసే అవకాశం ఉంది. అయితే దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో సమీకరణలు దాదాపు పూర్తి అయినందున ప్రమాణ స్వీకారం ఈరోజే పూర్తయ్యే అవకాశం ఉంది. ఎక్కడైన సమస్య ఎదురైతే తప్ప ఎన్నికలు ఈ రోజు ముగిసే అవకాశం ఉంది. ఈ ఎన్నిక ప్రక్రియను “చేయి ఎత్తే విధానం” (Open Ballot/Hands raising) ద్వారా పూర్తి చేయనున్నారు. ఏ అభ్యర్థికి ఎక్కువ మంది మద్దతుగా చేయి ఎత్తుతారో, వారినే విజేతలుగా అధికారులు ప్రకటిస్తారు. ఈ విధానం వల్ల పార్టీల మధ్య బలాబలాలు స్పష్టంగా తేలిపోవడమే కాకుండా, ఎక్స్‌అఫీషియో ఓట్ల వినియోగం కూడా కీలకం అయ్యే అవకాశం ఉంది.
మరో వైపుఏ మున్సిపల్ పీఠాలను దక్కించుకోవడంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మేజారిటీ స్థానాల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్న పార్టీలు తమ చైర్మన్, మేయర్ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయగా, హంగ్ ఏర్పడిన చోట స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం ప్రధాన పార్టీలు చర్చలు కొనసాగిస్తున్నాయి. పలువురు ఇండిపెండెంట్లు ఆయా పార్టీల్లో చేరడం లేదా మద్దతు ప్రకటించడం చేస్తున్నారు. అంతేకాకుండా, పార్టీ ఫిరాయింపులు జరగకుండా చాలా చోట్ల క్యాంపు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి.ఈ రోజు మధ్యాహ్నం కల్లా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు మరియు పట్టణాలకు కొత్త మేయర్లు, ఛైర్‌పర్సన్లు ఎవరో తెలిసిపోనుంది. ఈ ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉదయం 11 గంటలకు ముగుస్తుంది. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక జరుగుతుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లను కలుపుకొని ఈ ఎన్నిక జరుగుతుంది . ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేశారు. పార్టీ ఫిరాయింపులు, కిడ్నాప్‌ల ఆరోపణల నేపథ్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఈ ఎన్నిక సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఎర్పాడే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Follow Us