ELECTRICITY CHARGES : రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేశాయి. మూడు కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని తెలిపాయి. వీటిని ఈఆర్సీ ఆమోదిస్తే లోటును పూడ్చుకోవడానికి రూ. 1,200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనలపై రాష్ట్రంలో కనీసం మూడుచోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ చేశాకే ఈఆర్సీ తుది తీర్పునిస్తుంది.
అనంతరమే ఛార్జీల సవరణ అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియకు 90 రోజుల సమయం పడుతుంది. రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 14వేల 222 కోట్లుగా ఉంటుందని అంచనా వేసి తెలిపాయి. ఈ మొత్తంలో 13వేల 22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరాయి. మిగిలిన 1,200 కోట్ల లోటును పూడ్చుకునేందుకు ఛార్జీల సవరణ ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు పేర్కొన్నాయి.
ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ప్రస్తుతం 10 రూపాయలుగా వసూలు చేస్తుండగా, 50 రూపాయలకు పెంచడానికి అనుమతించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్లలోపు కరెంటు వాడుకునే ఇళ్లకు ఉచితంగానే సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి స్థిరఛార్జీ పెంపు ఉండదని తెలిపింది.
రాష్ట్రంలో మొత్తం కోటీ 30 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో 300 యూనిట్లలోపు వాడుకునేవారు 80 శాతానికి పైగా ఉన్నారు.
Also Read: Andhra Pradesh: తెలుగు తమ్ముళ్ళకు బంపర్ ఆఫర్..పార్టీ సభ్యత్వం