పాతబస్తీలోని మూసీ నిర్వాసితుల ఇళ్లు కూల్చివేతలను హైడ్రా అధికారులు ప్రారంభించారు. మలక్‌పేట నియోజకవర్గంలోని బస్తీలో స్వచ్ఛందంగా నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. బస్తీలోని కుటుంబాలను అధికారులు ముందుగానే ఖాళీ చేయించి.. లోకల్‌లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తరలించారు. నిర్వాసితుల సామానులను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలను కూడా ఏర్పరిచారు. మలక్‌పేట నియోజకవర్గంలో చాదర్‌ఘట్, రసూల్‌పురా, వినాయక్‌నగర్ బస్తీల్లో కూల్చివేతలు చేపట్టారు. బస్తీలు చిన్నగా ఉండటంతో జేసీబీలతో కాకుండా కూలీలతో కూల్చివేస్తున్నారు. భారీ పోలీసుల భద్రత మధ్య కూల్చివేతు జరుగుతున్నాయి.
కేటీఆర్ అడ్డగింత..
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ముషీరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూసీ నది వద్ద కొనసాగుతున్న కూల్చివేతలను పరిశీలించడంతో పాటు.. ఆందోళన చేస్తున్న వారికి మద్దతు తెలిపేందుకు బయలుదేరిన కేటీఆర్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కాన్వాయ్ ముందుకు కదలకుండా ఆందోళన చేపట్టారు. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు రావడంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబర్‌పేట, ముషీరాబాద్‌లో కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకోవడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అండగా ఉంటాం: కేటీఆర్ భరోసా
అంబర్ పేట నియోజకవర్గం, గోల్నాక డివిజన్లోని లంక తులసి రామ్ నగర్ ప్రాంతంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కారణంగా నివాసాలు కోల్పోతున్న బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. అండగా ఉంటామని.. మీ తరఫున పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి, జూబ్లీహిల్స ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ కీలక నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్లోల్ల కార్తిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇది కూడా చూడండి: జై భీమ్ సీన్ రిపీట్.. త్రీ టౌన్ పోలీసుల దాష్టీకం