/rtv/media/media_files/2026/02/14/political-heat-rises-in-mahbubnagar-mayor-seat-2026-02-14-20-23-20.jpg)
Political Heat Rises in Mayor Seat
Municipal Elections : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. తాజాగా ఆయా మున్సిపాలిటీల చైర్మన్, మేయర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు ఒకరోజు మాత్రమే సమయం ఉండటంతో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ‘చే’జిక్కించుకునేందుకు కాంగ్రెస్ దృష్టి సారించింది. ఆయా మున్సిపాలిటీలను సొంతం చేసుకునేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళుతుంది.అందులో భాగంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని ఆ పార్టీ భావిస్తోంది. దీనికోసం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరిచే స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల వారిని గుర్తించి వారిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో ఆయా జిల్లాల మంత్రులు రంగంలోకి దిగారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కాంగ్రెస్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ అభ్యర్థులు నెగ్గినట్లు ఈసీ వివరించినట్లు సమాచారం. సరైన వ్యూహంతో హంగ్ ఏర్పడిన వాటిని కూడా దక్కించుకుంటే 90 మున్సిపాలిటీలకుపైగా కాంగ్రెస్ వశమవుతాయని వారు వివరించినట్లు తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండేళ్లల్లో చేసి చూపించిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలు, ప్రజా పాలనపై ప్రజల్లో నమ్మకం పెంపొందించా యనేందుకు ఈ ఫలితాలు నిదర్శనం అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ తరుణంలో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలు, మంత్రులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు లోక్‌సభ నియోజకవర్గాల కమిటీల ఛైర్మన్లుగా పార్టీ నియమించిన ఇన్‌ఛార్జి మంత్రితో పాటు మరో మంత్రి లేదా సీనియర్ నేతను ఇన్‌ఛార్జులుగా నియమించారు. వీరంతా తమ పరిధిలోని హంగ్ మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు బీజేపీకి వెళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కరీంనగర్ కార్పొరేషన్‌కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కార్పొరేషన్‌కు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలను గెలిపించే బాధ్యతను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు, కొత్తగూడెంలో సీపీఐతో సమన్వయం చేసుకుని ఛైర్మన్ పదవిని దక్కించుకునే బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించింది.
ఈ క్రమంలో ఆయా మున్సిపాలిటీల్లో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులతో పాటు మజ్లిస్, వామపక్షాలు, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను ఆకట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించడంతో వారి కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థికి కోటి నుంచి రెండు కోట్ల వరకు ఆఫర్ ఇస్తుండటంతో పలువురు స్వతంత్రులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు. అలాగే ఇతర పార్టీల అభ్యర్థులను సైతం ఆకర్శించడానికి మంత్రులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ‘ఛైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నిక పూర్తయ్యే వరకూ కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు, మద్దతిచ్చే వారిని వెంటనే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల శిబిరాలకు తరలించారు. ఇక అనుకున్న స్థాయిలో అవకాశాలు లేని చోట ఎక్స్ అఫీషీయో సభ్యులుగా చేరి ఆయా స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. అధికార పార్టీ కావడం, పెద్ద ఎత్తున ఆఫర్ ఇస్తుండటంతో పాటు బీజేపీతో కలిసేందుకు ఆసక్తిలేని బీఆర్‌ఎస్, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో రేపు జరిగే చైర్మన్, మేయర్ ఎంపిక విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా? అన్న రీతిలో బిగ్ ఫైట్ తప్పేట్టు లేదు.
Follow Us