CM Revanth Reddy : 2034 నాటికి నెట్ జీరో సిటీగా హైదరాబాద్..  సీఎం రేవంత్ కీలక ప్రకటన!., నెట్ జీరో అంటే ఏమిటి?

రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను కాలుష్యం లేని నెట్ జీరో సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా కార్బన్ ఆడిట్ చేపట్టబోతున్న నగరంగా హైదరాబాద్ నిలవబోతోందన్నారు.

New Update
revanth reddy AICC meeting

తెలంగాణను ఆర్థికంగానే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో కూడా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముంబైలో జరిగిన క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం తెలంగాణ భవిష్యత్తుపై తన మార్క్ విజన్‌ను వినిపించారు. ముఖ్యంగా రాబోయే పదేళ్లలో అంటే 2034 నాటికి హైదరాబాద్‌ను కాలుష్యం లేని నెట్ జీరో సిటీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా కార్బన్ ఆడిట్ చేపట్టబోతున్న నగరంగా హైదరాబాద్ నిలవబోతోందని, వచ్చే ఐదేళ్లలో నగర ప్రధాన ప్రాంతాల్లో అసలు పరిశ్రమలే ఉండవని ఆయన కుండబద్దలు కొట్టారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహాన్ని వివరించారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్యూర్ ను ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి, తయారీ రంగంలో చైనాకు గట్టి పోటీనిచ్చేలా తెలంగాణను నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ వనరులే అసలైన కరెన్సీ అని, అందుకే సోలార్, హరిత ఇంధనానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ అంతిమ సంకల్పమని పేర్కొన్నారు.

పర్యావరణాన్ని కాపాడే క్రమంలో రవాణా వ్యవస్థలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు సీఎం వివరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తొలగించామని, దీనివల్ల ఈవీల వాడకం బాగా పెరిగిందని చెప్పారు. సుమారు 3 వేల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడంతో పాటు, రెండు లక్షల ఆటోలను పర్యావరణ హితంగా మారుస్తున్నామని తెలిపారు. కేవలం పరిశ్రమలే కాకుండా మూసీ నది పునరుద్ధరణ, చెరువుల సంరక్షణ కోసం హైడ్రా అనే ప్రత్యేక పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశామని, పర్యావరణం విషయంలో తమది రాజీ లేని పోరాటమని ఆయన ప్రపంచ ప్రతినిధులకు వివరించారు.

మోదీ ఏర్పాటు చేసిన విందులో

ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు. వివిధ దేశాల అధినేతలు, టెక్ దిగ్గజాలు పాల్గొన్న ఈ విందులో రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరోవైపు గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో జరిగే కీలక భేటీలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పనితీరుపై ఖర్గే, రాహుల్ గాంధీలతో చర్చించనున్నారు. కాగా, మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిశారు. 

నెట్ జీరో అంటే ఏమిటి? 

నెట్ జీరో అంటే చాలా సింపుల్‌గా చెప్పాలంటే.. మనం వాతావరణంలోకి ఎంత కాలుష్యాన్ని వదులుతున్నామో, అంతే మొత్తాన్ని రకరకాల పద్ధతుల్లో మళ్ళీ వెనక్కి తీసేయడం. అంటే ఒకవైపు బండ్లు, ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం విడుదలవుతుంటే, మరోవైపు చెట్లు నాటడం లేదా ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆ కాలుష్యాన్ని పీల్చేలా చేసి, వాతావరణంలో కాలుష్యం పెరగకుండా సున్నా దగ్గర బ్యాలెన్స్ చేయడమే ఈ నెట్ జీరో. హైదరాబాద్‌ను నెట్ జీరో సిటీగా మార్చడం అంటే మన నగరం పీల్చే గాలిని మళ్ళీ పాత రోజుల్లాగే స్వచ్ఛంగా మార్చడం అన్నమాట.

Advertisment
తాజా కథనాలు