హార్వర్డ్ నుండి CM రేవంత్‌కు అరుదైన ఆహ్వానం.. భారత్ నుంచి ఏకైక వ్యక్తి

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఏడాది మార్చి 27న అమెరికాలోని హార్వర్డ్ క్యాంపస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

New Update
_CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఏడాది మార్చి 27న అమెరికాలోని హార్వర్డ్ క్యాంపస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారతదేశం నుండి ఆహ్వానం అందుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం విశేషం.

ఈ సింపోజియంలో ముఖ్యంగా “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే అంశంపై జరిగే ప్యానెల్ చర్చలో సీఎం పాల్గొంటారు. AI వల్ల మానవ జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు ఎలా ప్రభావితమవుతాయనే అంశంపై ఆయన తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్ల పాత్రపై ఈ సెషన్‌లో లోతైన చర్చ జరగనుంది.

తెలంగాణను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను హార్వర్డ్ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ ఏర్పాటు, భూమి, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాల గురించి వివరించాల్సిందిగా ఆయనను కోరారు. ఇటీవలే రేవంత్ రెడ్డి హార్వర్డ్‌లో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సమయంలో నిర్వాహకులు స్వయంగా కలిసి ఈ ఆహ్వానాన్ని అందించారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు మరియు విద్యావేత్తల మధ్య సమన్వయం సాధించడం ద్వారా ఏఐ రంగంలో ఎలాంటి పురోగతి సాధించవచ్చో ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియనుంది.

Advertisment
తాజా కథనాలు