CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్ అయిపోయిందని అన్నారు. గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయిందని చెప్పారు. విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరిస్తాం అని అన్నారు. మూసీ నిర్వాసితులకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం అని అన్నారు. బీఆర్‌ఎస్ ఖాతాలో రూ.15 వందల కోట్లు ఉన్నాయని.. అందులో రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా? అని చురకలు అంటించారు. త్వరలో విపక్ష నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మీరొచ్చి మాకు సూచనలు ఇవ్వండి అని ప్రతిపక్షాలను కోరారు సీఎం రేవంత్.
అండగా ఉంటాం..
మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బఫర్‌జోన్‌లో ఇళ్లు ఉన్నవాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తాం అని చెప్పారు. ఫాంహౌస్‌లను కాపాడుకునేందుకే కొందరు పేదలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రత్యామ్నాయం అడిగితే చెప్పరు.. చెరువుల ఆక్రమణలతో మన బతుకులు సర్వనాశనం అవుతాయని అన్నారు. గత ఎండాకాలం బెంగళూరులో నీళ్లు లేని పరిస్థితి వచ్చిందని.. మూసీ నిర్వాసితులకు రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చెరువులు, నాలాలు పోయి, చివరకు మూసీ కూడా పోతే నగరం ఎలా వరద భరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం.