/rtv/media/media_files/2025/03/12/rw6tQWcBsNWpLwDUH4Lp.jpg)
Padi Kaushik Reddy
Padi Kaushik reddy : ఎప్పుడూ వివాదాల్లో ఉండే హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్‌ని మతం పేరుతో దూషించాడన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 126 (2), 132, 196, 299 బిఎన్ఎస్ సెక్షన్‌లతోపాటు మరికొన్నిసెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసులపై దుర్భషలాడడం, విధులకు ఆటంకం కలిగించడం, దౌర్జన్యం చేయడం వంటి అభియోగాలపై సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా గురువారం పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా వీణవంకలో స్థానికంగా జరిగిన సమ్మక్క జాతరకు వెళ్లారు. ఎమ్మెల్యే తన కుటుంబసమేతంగా భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత వాహనాలనే అనుమతి ఇస్తామని ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచి దిగి.. తన కుటుంబసభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. తమను అడ్డుకోవద్దని పోలీసులను హెచ్చరించారు. ఆ క్రమంలో పోలీస్ కమిషనర్‌పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని. తనను అడ్డుకుంటే అపుడు మీ సంగతి చెబుతానంటూ కౌశిక్ రెడ్డి పోలీసులను బెదిరించినట్లు ఆరోపిస్తున్నారు. ఒక దశలో పోలీసులకు, కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకున్నారు. అనంతరం నాలుగు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వడంతో.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి వీణవంకకు వెళ్లారు. అయితే వీణవంక జాతరలో దళిత మహిళా సర్పంచ్ చేత కొబ్బరికాయ కొట్టించాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టుబట్టడంతో మరోసారి వివాదం చెలరేగింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు సూచించారు. పోలీసుల సూచనను ఆయన పట్టించుకోలేదు. దాంతో ఎమ్మెల్యేను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా బయటకు పంపించివేశారు. మరోవైపు వీణవంకలో సమ్మక్క జాతర ట్రస్టీ ఉదయానందరెడ్డి వర్గానికి, కౌశిక్ రెడ్డి వర్గానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన జాతరకు వస్తే ఘర్షణ జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నట్లు సమాచారం.
Follow Us