Chevella Road Accident : కన్నీరు మిగిల్చిన బస్సు ప్రమాదం..వీడియోలు వైరల్‌

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు.

New Update
FotoJet - 2025-11-03T110024.096

RTC Bus and Lorry Incident

Chevella Road Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. కంకర లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్ర్బాంతిని మిగిల్చింది. ప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తున్నాయి.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఘటన ప్రాంతంలో ప్రయాణికుల ఆర్తనాదాలు గుండెను పిండేస్తున్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.  

ప్రమాదం ధాటికి లారీలోని కంకర అంతా బస్సులో ఉన్న ప్రయాణికులపై పడిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. బస్సు కుడివైపున ఉన్న 8 సీట్ల వరకు ఉన్న ప్రయాణీకులు స్పాట్‌లో మరణించారు.స్థానికులు, వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అదేవిధంగా క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు నడిరోడ్డుపై లారీ, బస్సు పడిపోవడంతో చేవెళ్ల - వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో  గంట నుంచి వాహనదారులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా, పోలీసులు చేపట్టిన సహాయక చర్యల్లో కూడా అపశృతి చోటుచేసుకుంది. చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జేసీబీ ఎక్కింది. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను కూడా చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి‌కి తరలించారు.  

కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ

బస్సు ప్రమాదం విషయం తెలిసిన తర్వాత చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ తగిలింది.అయితే ప్రమాదం జరిగిన చాలా సమయం తరువాత ఎమ్మెల్యే కాలే యాదయ్య ఘటనా స్థలానికి చేరుకోవడంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదని ఎమ్మెల్యేను పలువురు నిలదీశారు. అనేకసార్లు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పిన నిరక్ష్యం చేశారని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. స్థానికులు నిరసన తెలపడంతో ఘటన స్థలం నుంచి ఎమ్మెల్యే కాలే యాదయ్య వెళ్లిపోయారు. దీంతో ఆయనపై ప్రజలు మండిపడుతున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం చేయండి..ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

ఘోర రోడ్డు ప్రమాదంలో 24ప్రాణాలు కోల్పోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి పొన్న ప్రభాకర్ స్పందించి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్‌, డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు.. అత్యవసర వైద్య సాయంతో పాటు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

పవన్‌ దిగ్భ్రాంతి

ఈ షాకింగ్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.  

ప్రమాదానికి కారణలివే...

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రధానకారణంగా  తెలుస్తోంది. అలాగే లారీలో ఉన్న కంకర బస్సులో పడడం కూడా మరో కారణం.  టిప్పర్ లో ఉన్న కంకర బస్సులో పడటంతో ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. టిప్పర్ మితిమీరిన వేగంతో రావడం వల్ల మలుపులో డ్రైవర్ స్పీడ్ కంట్రోల్ చేయలేక బస్సును ఢీ కొట్టినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. టిప్పర్ లారీ (Tipper lorry)లోని కంకర బస్సులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. ఇక కంకర టిప్పర్లు ఈ ప్రాంతంలో విరివిగా తిరగుతున్నాయి. అది కూడా  మితిమీరిన వేగంతో రావడం కూడా కారణమే. లారీల ప్రయాణంతో రోడ్డు గుంతలు పడడంతో తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరుకైన రోడ్డు కావడం రోడ్డు గుంతలు పడటం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు