MLA KTR: తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండేట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ట్విట్టర్ వేదికగా #ASKKTR పేరుతో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్న.. పార్టీని ఎలా నడిపించాలి అనే కార్యాచరణను తమకు దిశా నిర్దేశం చేస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ కు టైం ఇద్దామని...
త్వరలో కేసీఆర్ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటారని చెప్పారు. 2025 తరువాత కేసీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా వస్తారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు చేయడం కోసం ఆయన ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు అన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి కేసీఆర్ సమయం ఇవ్వడంలో తప్పేమి లేదని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి కారణంగానే ఓడిపోయినట్లు ఓటమి గల కారణాన్ని చెప్పారు. ఎన్నికల సమయంలో తప్పు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ప్రజల్లో తప్పుడు ఆశలు రేకెత్తించాయని అన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి అంటూ ఏమీ లేదు అని ఫైర్ అయ్యారు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టం అని వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయాలు వద్దు అనుకున్న...
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం వదలడం లేదని వాపోయారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతున్నారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదని చెప్పారు. తన 18 ఏళ్ల ప్రజా జీవితంలో తన కుటుంబసభ్యులు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. ఒక దశలో రాజకీయాలకు స్వస్తి పలుకుదాం అనుకున్నానని అన్నారు. కానీ ప్రజల కోసం నిలబడి.. పోరాడాలని నిర్ణయించుకున్నానని అన్నారు.