/rtv/media/media_files/2025/10/15/deepak-reddy-is-the-bjp-candidate-2025-10-15-11-33-08.jpg)
Jubilee Hills By Election Results
Jubilee Hills Results: ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు.అందరూ ఊహించినట్లే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. ఏ దశలోనూ బీజేపీ పోటీ ఇవ్వలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అనూహ్యంగా డిపాజిట్ కోల్పోవడం గమనార్హం.ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కేవలం 17.061 ఓట్లు వచ్చాయి. బీహార్ లో ఎన్డీఏ ఘనవిజయం దిశగా దూసుకుపోతుంది. అయితే జూబ్లీహిల్స్ ఫలితాలతో తెలంగాణ బీజేపీలో ఆ జోష్ కనిపించడంలేదు. జూబ్లీ ఓటమితో బీజేపీ కేడర్ నిరుత్సాహంలో ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం డిపాజిట్ వస్తుందని బీజేపీ కార్యకర్తలు భావించారు. కానీ డిపాజిట్ గల్లంతు అవ్వడంతో సంబరాలకు కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్ లో తాము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదని గుర్తుచేశారు. తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆరోపించారు.
కాగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకీ ప్రత్యామ్నయం అని చెప్పుకుంటున్న బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం సంచలనంగా మారింది. కాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే బీజేపీ ఈ స్థానంపై అంతగా ఆసక్తి చూపలేదు. అభ్యర్థిని ప్రకటించడంలోనూ ఆలస్యం చేసింది. రాష్ట్ర నాయకత్వం ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి కేంద్ర నాయకత్వానికి పంపినప్పటికీ వారిలో అభ్యర్థిని ఎంపిక చేయడంలోనూ అధిష్టానం ఆసక్తి చూపలేదు. బీహార్ ఎన్నికల షెడ్యూల్‌కు ఇచ్చిన ప్రాధాన్యత జూబ్లీహిల్స్‌కు ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలోనూ ఆ పార్టీ నేతలు పెద్దగా పాల్గొనలేదన్న ప్రచారం ఉంది. కేవలం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మినహా మిగిలిన వారు ఎన్నికల ప్రచారంలో పాల్గన్న దాఖలాలు లేవు. రాష్ర్టంలో బీజేపీకి 8మంది ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారు ఎవరూ ఎన్నికల ప్రచారంలో అంతగా కనిపించలేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమే తరుచుగా కనిపించగా, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడక్కడ ప్రచారం చేశారు.
కాగా తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ నేతలు బీహార్ కు వెళ్లి ప్రచారం చేసినప్పటికీ జూబ్లీహిల్స్‌లో మాత్రం ప్రచారం చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ప్రచారం చేసిన కిషన్ రెడ్డి కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంలో ఫేయిల్ అయ్యారనే టాక్ వినపడుతోంది. కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంలను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తే. బండి సంజయ్ కేవలం హిందూ, ముస్లీం సామాజిక వర్గాల్లో తేడాను ప్రచారం చేయడంతో పాటు తమకు వ్యతిరేక వర్గం ఓట్లు వద్దు అంటూ ఖరాఖండిగా చెప్పడం గమనార్హం. ఇక పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచంద్రరావు కూడా ఓటర్లను ఆకట్టుకోవడంలో విపలమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పొవడం పార్టీ ప్రతిష్టకు చెరగని మచ్చే అనడంలో సందేహం లేదు.
Follow Us