వెంకయ్యనాయుడు తర్వాత మరో తెలుగు వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారా? తెలంగాణ నుంచే బీజేపీ కొత్త సారథి రానున్నారా? ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే అనిపిస్తోంది. ఈ సారి దక్షిణాది నుంచే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన వ్యక్తికే ఆ అవకాశం ఇవ్వాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా.. ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికైనా తెలగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ సారథిని ఇక్కడి నుంచే నియమిస్తే కార్యకర్తల్లో కొత్త జోష్ వస్తుందని.. దీంతో పాటు దక్షిణాది వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. దీంతో తెలంగాణ ముఖ్య నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కిషన్ రెడ్డి, కే లక్ష్మణ్, బండి సంజయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: BREAKING: మంత్రి కొండా సురేఖకు షాక్!
కిషన్ రెడ్డి:
కిషన్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పని చేశారు. జాతీయ యువమోర్చా అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. గత మోదీ ప్రభుత్వంలోనూ ఆయన మంత్రిగా పని చేశారు. పార్టీకి వీరవిధేయుడిగా పేరున్న కిషన్ రెడ్డి పేరును జాతీయ అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Telangana: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దీపావళి శుభవార్త!
లక్ష్మణ్..
ప్రస్తుతం లక్ష్మణ్ ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా సైతం పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. బీసీ, దక్షిణాది కోటాలో ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
బండి సంజయ్:
బలమైన హిందుత్వ వాదిగా పేరున్న బండి సంజయ్ పేరు సైతం బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం వినిపిస్తోంది. తెలంగాణలో పార్టీ పగ్గాలు చేపట్టిన అతి కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీని పరుగులు పెట్టించిన తీరు, కార్యకర్తల్లో జోష్ నింపిన తీరు జాతీయ నాయకత్వాన్ని ఆకట్టుకుంది. అనివార్య కారణాలతో ఆయనను పదవి నుంచి తప్పించాల్సి వచ్చినా.. పలుకుబడి మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సంజయ్ కు కేంద్ర పదవి వచ్చింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పేరును సైతం బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.