Kamareddy : కామారెడ్డిలో హైటెన్షన్..  ఈటల హౌస్ అరెస్ట్!

కామారెడ్డి జిల్లాలో భూముల వ్యవహారం కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. అరోరా కాలేజీ భూములపై చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విసిరిన సవాల్‌తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

New Update
bjp

కామారెడ్డి జిల్లాలో భూముల వ్యవహారం కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. అరోరా కాలేజీ భూములపై చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విసిరిన సవాల్‌తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరకు కాంగ్రెస్ నేతలు భారీగా చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక కాంగ్రెస్ నేత కారు అద్దాలు ధ్వంసం అవ్వడంతో పరిస్థితి చేయి దాటిపోయింది.

కామారెడ్డిలో తన పార్టీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిని నిరసిస్తూ, ఆయన్ని పరామర్శించేందుకు బయలుదేరిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మేడ్చల్ ఏసీపీ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన పోలీసులు ఈటలను ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఈటల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గూండాయిజం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది.. వీరికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అంటూ ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ నేతలకు గట్టి కౌంటర్

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా కాంగ్రెస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్రమాలను అడ్డుకుంటున్నందుకే నాపై కక్ష కట్టారు.. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఇప్పుడే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. అరోరా కాలేజీలు, శిశుమందిర్ భూముల భాగోతం అందరికీ తెలుసని, ఇది కేవలం 'ట్రైలర్' మాత్రమేనని, అసలు 'సినిమా' ముందుందని వ్యాఖ్యానించారు. తనను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటామన్న వారికి, తనే స్వయంగా వస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు.

ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు భారీగా మొహరించి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ గొడవలో కొందరు పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. మొత్తం మీద ఈ భూముల రచ్చ అటు కామారెడ్డిని, ఇటు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.

Advertisment
తాజా కథనాలు