/rtv/media/media_files/2026/02/11/fotojet-13-2026-02-11-20-44-11.jpg)
Municipal elections
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సరళి తొలుత ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ పోలింగ్ ముగిసే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల మధ్య వాగ్వాదాలు, ఘర్ణణలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల రాజకీయ పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అదుపుతప్పే పరిస్థితులు ఉంటే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంతో పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగిపోయింది. రేపు ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికల సమరం- అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. వీటి మధ్యే ముక్కోణపు పోటీ నెలకొంది.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో తమ జెండా ఎగరేసేందుకు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచార పర్వాన్ని సాగించాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతు రాజకీయాన్ని రక్తికట్టించాయి. మహబూబాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా సంగారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సీఐ.. 34 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గల్ల పట్టుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలింగ్ ఆపేస్తామంటూ బూత్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జగ్గారెడ్డికి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు సీఐ సహకరిస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇక సదాశివపేట పట్టణం 25వ వార్డులో కాంగ్రెస్ కార్యకర్త పోలింగ్ బూత్ లో డబ్బులు పంచుతుండగా బీజేపీ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ జయ శ్రీ పట్టుకున్నారు. దీంతో పోలింగ్ బూత్ వద్దే ఇరు పార్టీ వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులోనూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రానికి వెళుతున్న ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. రెండు పార్టీల కార్యకర్తల పోలింగ్ కేంద్రంలోనే పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పోలీసులు కలగజేసుకొని కార్యకర్తలను చెదరగొట్టారు.
నిజామాబాద్‌లో మరో సంఘటన చోటుచేసుకుంది. బూత్ నెంబర్ 7లో శంకర్ అనే కానిస్టేబుల్, మరో మున్సిపల్ ఉద్యోగి కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే సమాచారం తమకు అందిందంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అక్కడకు చేరుకున్నారు. వారి తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఏసీపీతో ఆయన వాగ్వాదానికి దిగారు. మీ కానిస్టేబుల్ తప్పు చేస్తే... మీరు చేసినట్టేనని ఎంపీ అరవింద్ ఏసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో పోలింగ్ బూత్ వద్ద బీజేపీ అభ్యర్థిని బయటికి పంపించారని ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న ఎంపీ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం బూత్ లోపలికి వెళ్లి ఎన్నికల అధికారికి వార్నింగ్ ఇచ్చారు. దొంగ ఓట్లు వేస్తున్న కాంగ్రెస్‌కు ఎలా మద్దతిస్తావంటూ ప్రశ్నించారు. బోధన్ పట్టణంలో ఎంఐఎం, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. రాకాసిపేట్ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలింగ్ సిబ్బంది అడ్డుకున్నారు.
ఇక కరీంనగర్‌లోనూ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నాడని బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేసి వాహనం ఎక్కించారు. అయితే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమాలకర్ అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు బీఆర్ఎస్‌పై దాడులు చేస్తున్నారంటూ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో పోలీస్ వాహనం నుంచి తన కార్యకర్తను బయటకి తీసుకొచ్చారు. దీంతో పోలీసులు, గంగుల మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. మరో ఘటనలో కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద గుమిగూడిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. ఈక్రమంలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ కమలం పార్టీ కార్యకర్తలు నడిరోడ్డుపై బైఠాయించారు. 58వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని చెబుతుంటే.. పోలీసులు తమపై లాఠీ ఛార్జి చేయడమేంటని మండిపడ్డారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధి 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహిళలతో దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించారని బీఆర్ఎస్ వారిని అడ్డుకుంది. దీంతో వాగ్వాదం జరగడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తోపులాట చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మహబూబాబాద్ పట్టణంలోని 32, 33 నెంబరు పోలింగ్ బూత్‌ల వద్ద స్వల్ప ఘర్షణలు జరిగాయి. 14వ వార్డులో పోటీలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత పెరిగింది.
Follow Us