తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం 'బతుకమ్మ'

ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి, ఆత్మీయ సమ్మేళనానికి తార్కాణం బతుకమ్మ. పెద్దలు చెప్పే ప్రతీ బతుకమ్మ కథలోనూ వీరవనితల పోరాట పటిమ, ప్రశ్నించే తత్వం కళ్ళకి కనిపిస్తుంది. ఈ సారి బతుకమ్మ సంబరాలు గడీల మధ్య కాకుండా అసలైన తెలంగాణ సంస్కృతి మధ్య జరుగనున్నాయి. -ఇందిరా శోభన్

New Update
Bathukamma 2024 indira shobhan

ఒక్కొక్క పువ్వేసి చంద మామ|| 
ఒక జాము ఆయే చంద మామ||
రెండేసి పువ్వు తీసి || చంద మామ|| 
రెండు జాము లాయె ||చంద మామ||

.. ఇలా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆడపడుచులు బతుకమ్మను కొలుస్తారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి తెలంగాణ నేలపై జరుపుకుంటున్న ప్రాచీనమైన గొప్ప సంప్రదాయ పండుగ. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలిసేలా ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు పూలతో మెరూ పర్వతంలా పేర్చి బతుకమ్మను నిర్వహించారని ప్రతీతి. అప్పటినుంచి తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. దసరాకి రెండు రోజుల ముందుగా మొదలై, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవితో పాటు, గౌరీ దేవిని కూడా భక్తి శ్రద్దలతో పూజిస్తారు. తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తూ, పూలతో అలంకరిస్తూ, నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు. మన పూర్వీకులు భావి తరాలకు అందించినటువంటి గొప్ప సాంస్కృతిక, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ.

ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి చిహ్నం..

తెలంగాణ సంస్కృతి అనగానే మన యాదిలో మెదిలే చిహ్నం ఈ వేడుక. తెలంగాణ పుడమి ఒడిలో పురుడోసుకున్న పువ్వులను పూజించడం, ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి, ఆత్మీయ సమ్మేళనానికి తార్కాణం బతుకమ్మ. మన పెద్దలు బతుకమ్మ పండుగ గురించి ఎన్నో కథలు కథలుగా చెబుతారు. ప్రతి కథలోనూ వీరవనితల పోరాట పటిమ, ప్రశ్నించే తత్వం కళ్ళకి కనిపిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల ఆగడాలను ఎత్తి చూపిన వైనం, స్వరాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో ‘బతుకమ్మ’ ఆటపాటలతో మహిళలు తమ నిరసన గళం వినిపించిన తీరు ఏ మాత్రం తీసిపోనివి. అనేక తెలంగాణ ఉద్యమ పాటలు ప్రజల నోట నుండి వెలువడ్డాయి. ఆటపాటలు చప్పట్ల దరువులతో ప్రజలను సంఘటిత పర్చాయి. సకల జనులను సమీకరించి ఉద్యమ సారథి అయ్యి నిల్చింది.

నేటికీ అదే ధీరత్వం, సాహసం..

బతుకమ్మ. దేశముఖులు, జమీందార్లు, దొరల వ్యవస్థలో బతుకమ్మ ఒక వినోద వేడుకగా ఉండేది. కాగా పీడిత ప్రజలు తమ బాధలను పాటల రూపంలో బతుకమ్మతో మొరపెట్టుకుంటూ నిరసన వ్యక్తం చేసేవారు. దొరల గడీల్లో అత్యంత హేయంగా మహిళల బట్టలు విప్పి బతుకమ్మలు ఆడిపించిన దురదృష్టకర సంఘటనలు ఉన్నా.. పాశవిక విధానాలకు భయపడక, పెత్తందారీ వ్యవస్థకు తిరగబడి మాన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఊర్లను తగలబెట్టినా.. బతుకమ్మను కొలవడం మాత్రం ఆపలేదు. ఆ సంఘటనలు తెలంగాణ వీరవనితల సాహసానికి నిదర్శనం. అదే ధీరత్వం, సాహసం నేటికీ తెలంగాణ మహిళల్లో కనిపిస్తుంది. పైకి సౌమ్యంగా కనిపించినా సమస్యలు ఎదురైనపుడు కదనరంగంలోకి దిగడానికి సంశయించరు. అదీ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 'బతుకమ్మ' ఆటపాటలతో నిరూపితమైంది.

గత పాలనలో అవమానం..

దుర్గాదేవి ప్రతిరూపాలుగా నేలపై నడియాడే మహిళలను గౌరవించడం, వారికి రక్షణ కల్పించడం, శ్రేయస్సుకు పాటుపడటం ప్రభుత్వాల కర్తవ్యం. గత పాలకులు దీనిని విస్మరించారు. గత ప్రభుత్వం బతుకమ్మకు రాజకీయాలను అంటకాగించి, బతుకమ్మ చీరల పేరిట నాసిరకం చీరలతో అవమానపరిచింది. ఏనాడూ సరైన ప్రాధాన్యతను ఇవ్వలేదు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అగ్ర ప్రాధాన్యతను ఇస్తోంది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలల్లో మహిళలకు అగ్రతాంబులం ఇస్తోంది. మహిళల ఆరోగ్య సంరక్షణకు, సాధికారతతో కూడిన ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించేందుకు చర్యలు చేపడుతోంది. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాదిగా భావిస్తూ సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తోంది.

నేడు అసలైన తెలంగాణ సంస్కృతి మధ్య..

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యజమానిగా గుర్తించనున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న గృహలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలతో రాష్ట్రంలోని ఎంతోమంది నిరుపేద మహిళల ఆర్థిక స్వాలంబనకు అండగా నిలుస్తోంది. గత పాలకులు డబ్బులతో బతుకమ్మ సంబరాలను జుబ్లీహిల్స్, బంజారాహిల్స్ కు చేర్చారు. తెలంగాణ సమాజం ఎప్పుడు అలా కోరుకోలేదు. ఈ సారి బతుకమ్మ సంబరాలు గడీల మధ్య కాకుండా అసలైన తెలంగాణ సంస్కృతి మధ్య జరుగనున్నాయి. హైడ్రా చేపట్టే చర్యలతో చెరువులు, కుంటలు, వాగులు స్వచ్ఛమైన నీటితో కళకళలాడాలని, గౌరీ దేవి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరగాలని కోరుకుందాం.

- ఇందిరా శోభన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు