/rtv/media/media_files/2025/10/29/azharuddin-2025-10-29-15-49-08.jpg)
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పదవిపైనే ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో అనూహ్యంగా మంత్రివర్గంలోకి వచ్చిన అజారుద్దీన్ భవితవ్యం ఇప్పుడు 'డెడ్ లైన్' దిశగా సాగుతోంది. అటు సుప్రీంకోర్టు తీర్పు, ఇటు చట్టసభ సభ్యత్వం.. ఈ రెండింటి మధ్య ఆయన మంత్రి పదవిపై అనేక సందేహాలు నెలకొన్నాయి.
దగ్గర పడుతున్న ఆరు నెలల డెడ్‌లైన్
రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి, పదవి స్వీకరించిన 6 నెలల లోపు ఏదో ఒక చట్టసభకు (అసెంబ్లీ లేదా కౌన్సిల్) ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రి అయి ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. అంటే, మరో నాలుగు నెలల లోపు ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకపోతే, మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు.
సుప్రీంకోర్టులో కేసు పెండింగ్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం ఇప్పుడు అజారుద్దీన్‌కు పెద్ద చిక్కుగా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే, రేవంత్ ప్రభుత్వం కోదండరామ్, అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కోటాకు సిఫారసు చేసింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఏప్రిల్ లోపు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉండదు.
ఖాళీ లేని ఎమ్మెల్సీ సీట్లు
రాష్ట్రంలో వచ్చే ఏడాది నవంబర్ వరకు కొత్తగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. కేవలం గవర్నర్ కోటా మాత్రమే ఆయనకు ఉన్న ఏకైక మార్గం. ఒకవేళ కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే, ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
రేవంత్ రెడ్డి ముందున్న 2 మార్గాలు:
అజారుద్దీన్ పదవిని కాపాడటానికి సీఎం రేవంత్ రెడ్డి ముందు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ రాజీనామా: ప్రస్తుతం ఉన్న ఎవరైనా ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేసి, ఆ స్థానంలో అజారుద్దీన్‌ను పంపడం. అయితే, పదవుల కోసం తీవ్ర పోటీ ఉన్న కాంగ్రెస్‌లో ఇది అంత సులభం కాదు.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి, అక్కడ వచ్చే ఉప ఎన్నికలో అజారుద్దీన్‌ను బరిలోకి దించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే, అజారుద్దీన్ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుంది.
సందిగ్ధంలో కోదండరామ్ పరిస్థితి
అజారుద్దీన్ సమస్య ఇలా ఉంటే, మరోవైపు ప్రొఫెసర్ కోదండరామ్ పరిస్థితి కూడా సందిగ్ధంలో పడింది. ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పులో ఏదైనా తేడా వస్తే, ప్రభుత్వం తీసుకున్న ఈ నామినేషన్ల నిర్ణయం మొత్తం తలకిందులయ్యే ప్రమాదం ఉంది. అజారుద్దీన్ మంత్రి పదవి గండం గట్టెక్కాలంటే ఇప్పుడు అంతా సుప్రీంకోర్టు చేతుల్లోనే ఉంది. ఏప్రిల్ లోపు కోర్టు నుంచి సానుకూల తీర్పు రాకపోతే, తెలంగాణ క్యాబినెట్‌లో మార్పులు ఖాయమని స్పష్టమవుతోంది. రేవంత్ రెడ్డి తన 'మిత్రుడి' పదవిని కాపాడుకోవడానికి ఎటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Follow Us