/rtv/media/media_files/2026/03/09/konda-sureka-vs-swarna-2026-03-09-15-44-13.jpg)
Konda Surekha vs Errabelli Swarna
Konda Surekha vs Errabelli Swarna : రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పగ్గాలు ఎర్రబెల్లి స్వర్ణకు అప్పగించడంతో వరంగల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొండా సురేఖ వరంగల్ లో సాగిస్తున్న ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకే జిల్లా హస్తం నేతలు హైకమాండ్ పై ఒత్తిడి చేయటంతోనే ఆమెకు పదవి దక్కినట్టు ప్రచారం జరుగుతున్నది. 2018 నుంచే సురేఖ, స్వర్ణ మధ్య ఆధిపత్య పోరు సాగుతుండగా, తాజా నియామకం కొండా వర్గానికి కోలుకోలేని దెబ్బగా మారింది. జిల్లా ఎమ్మెల్యేలు, కీలక నేత వేం నరేందర్ రెడ్డి, ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటితో సురేఖకు విభేదాలున్నాయి. మంత్రిపై అసంతృప్తితో ఏకమైన వ్యతిరేక వర్గం నాయుకులు.. సురేఖ దూకుడుకు బ్రేకులు వేసేందుకు స్వర్ణకు కీలక పదవి దక్కేలా చక్రం తిప్పినట్టు సమాచారం. దీంతో జిల్లాలో కొండా ఫ్యామిలీ ప్రాధాన్యత తగ్గుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
కొండా సురేఖ, ఎర్రబెల్లి స్వర్ణ కుటుంబాల మధ్య రాజకీయ వైరం నేటిది కాదు. ఏళ్లుగా ఓరుగల్లు కోటలో ఆధిపత్యం కోసం వీరి మధ్య పోరు సాగుతోంది. ముఖ్యంగా 2018లో ఎర్రబెల్లి స్వర్ణకు వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై కొండా సురేఖ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కొండా సురేఖ జిల్లాలో తన ఆధిపత్యం సాగిస్తున్నారు. ఎర్రబెల్లి స్వర్ణతో విభేదాలు కొనసాగాయి. అంతేకాకుండా జిల్లాలోని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సురేఖకు విభేదాలు పొడసూపాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డితో సాగుతున్న గ్రూప్ వార్, ఇన్ ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సురేఖ కూతురు చేసిన ఘాటు విమర్శలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అంతేకాకుండా ఇటీవల పరకాల నియోజకవర్గంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో జరిగిన ఓ కార్యక్రమంలో కొండా సుస్మిత పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచే ఎమ్మెల్యే అవుతానని ప్రకటించారు. అప్పుడు ఆమె పక్కన కొండా మురళీ సైతం ఉండటం గమనార్హం.
ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ తీరుతో విసిగిపోయిన జిల్లాలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కొండా కుటుంబ ప్రాధాన్యతను తగ్గించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఎర్రబెల్లి స్వర్ణకు రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వాలని అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి చేసినట్టు తెలుస్తున్నది. సురేఖకు సమాంతరంగా జిల్లాలో మరో శక్తి కేంద్రాన్ని సృష్టించడం ద్వారా ఆమె దూకుడుకు కళ్లెం వేయవచ్చని వ్యతిరేక వర్గం భావించింది. అందుకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్వర్ణకు లక్కీ ఛాన్స్ దక్కింది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా స్వర్ణ నియామకంతో జిల్లాలో సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. రాష్ట్ర స్థాయి పదవి కావడంతో స్వర్ణకు నేరుగా ఏఐసీసీ పెద్దలు, రాష్ట్ర నాయకత్వంతో సంబంధాలు ఉంటాయి. దీనివల్ల జిల్లా కమిటీల నియామకాల్లో, టికెట్ల కేటాయింపులో స్వర్ణ మాట చెల్లుబాటయ్యే అవకాశం ఉంది. ఇది సురేఖకు పెద్ద సవాల్‌గా మారనుంది. మరోవైపు, స్వర్ణకు వరంగల్ మేయర్‌గా, డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న సుదీర్ఘ అనుభవం ఆమెకు అదనపు బలం.
మంత్రిగా సురేఖకు ప్రభుత్వ పరంగా అధికారం ఉన్నప్పటికీ, పార్టీ సంస్థాగత విషయాల్లో స్వర్ణ కీలకంగా మారబోతున్నారు. జిల్లాలో ఎవరి పెత్తనం పెరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే స్వర్ణకు కీలక పదవి దక్కడంపై కొండా సురేఖ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. జిల్లాకు సంబంధించిన హస్తం ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలంతా కలిసి కొండా సురేఖపై కుట్రలు చేస్తున్నారని ఆమె అనుచరవర్గం బాహాటంగానే ఆరోపిస్తోంది. మంత్రి ఎదుగుదలను ఓర్వలేక, జిల్లాలో ఆమెకున్న ప్రజాదరణను తగ్గించేందుకే పథకం ప్రకారం ఈ నియామకం జరిగేలా చక్రం తిప్పారని వారు మండిపడుతున్నారు. ముఖ్యంగా కొండా కుటుంబానికి కంచుకోటలాంటి వరంగల్ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు, వ్యతిరేక వర్గం అంతా ఏకమై అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారని కొండా మురళి వర్గం వాదిస్తోంది. కష్టకాలంలో పార్టీని కాపాడిన నాయకత్వాన్ని బలహీనపరచడం వల్ల పార్టీకే నష్టమని, పదవుల కోసం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం తగదని వారు హెచ్చరిస్తున్నారు. మంత్రిపై పనిగట్టుకుని జరుగుతున్న ఈ ప్రచారాలు, రాజకీయ ఎత్తుగడల వెనుక ఎవరెవరు ఉన్నారో తమకు తెలుసని, తగిన సమయంలో వీటన్నిటికీ బుద్ధి చెబుతామని కొండా వర్గీయులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిణామాలతో వరంగల్ కాంగ్రెస్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Follow Us