మోసం చేసిన యువకుడు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండలం తిళ్లకుప్ప గ్రామానికి చెందిన యాళ్ల శ్రీనివాస్ అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉన్నాడు. అక్కడే సొంతంగా సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్న సంధ్య అనే అమ్మాయితో అతడికి పరిచయం అయింది. సంధ్యకి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో శ్రీనివాస్ తనపై చూపించే ప్రేమ నిజం అనుకుని నమ్మింది. యాదగిరిగుట్టకు వెళ్లి నరసింహస్వామి సాక్షిగా ఇద్దరూపెళ్లి చేసుకుని సంవత్సరం పాటు కాపురం చేశారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆమెను శారీరకంగా అనుభవించిన తర్వాత ఆమెని వదిలేసి పోలవరంలో ఉన్న తన ఇంటికి శ్రీనివాస్ వచ్చేశాడు. అక్కడే మరో పెళ్లి చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకన్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఆ యువతి హైదరాబాద్ నుంచి యువకుడి ఇంటి వద్దకు వచ్చి ధర్నాకు దిగింది.
ఎంతవరకైనా పోరాడుతా
శ్రీనివాస్ చెల్లి దివ్య, బావ పుప్పాల శ్రీహరిలు హైదరాబాద్‌లో ఉంటూ తనను తప్పుదోవ పట్టించారని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను కుటుంబ సభ్యులు బెదిరించి బలవంతంగా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారని ఆరోపించింది. చివరికి గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడినప్పటికీ కూడా నాకు న్యాయం జరగలేదని ఆ యువతి వాపోయింది. తనకు తన భర్త కావాలని.. న్యాయం జరగడానికి ఎంతవరకైనా పోరాడుతానని సంధ్య చెబుతోంది. శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
మహిళా సంఘాలు మద్దతు
ఆమెకు అండగా సీసీఐడి నేషనల్ కమిటి చైర్ పర్సన్ డాక్టర్. బి. శివపావని ఆధ్వర్యంలో మహిళా సంఘాలు యువతికి మద్దతు తెలిపాయి. ఇటువంటి వ్యక్తులకు బుద్ది చెప్పే వరకు యువతీకి అండగా ఉంటామని మహిళా సంఘాలు చెబుతున్నాయి. అవసరం అయితే ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలిసి న్యాయం చేయమని కోరుతామని సీసీఐడి నేషనల్ కమిటి చైర్ పర్సన్ శివపావని చెప్పారు. ఇదిలా ఉండగా ఆమె ధర్నా చేయడానికి తన ఇంటికి వస్తుందన్న విషయం తెలిసి శ్రీనివాస్ ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులతో పరార్ అయ్యాడు. దాంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.