Telangana Overseas Scholarships: తెలంగాణ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ ప్రతీఏడాది రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓవర్సీస్ విద్యానిధి (Overseas Vidya Nidhi) కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఒక్కో విద్యార్థికి ఉన్నత విద్యా కోర్సు పూర్తి చేసే వరకు ఆర్థికంగా ఆదుకుంటుంది. రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో ఇస్తుంది. అయితే ఈ ఏడాది ఎన్నికల కోడ్ (Election Code) కారణంగా నిధులకు బ్రేక్‌లు పడ్డాయి. ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. దరఖాస్తుల స్వీకరణ, విద్యార్థుల ఒరిజినల్ డాక్యుమెంట్స్ పరిశీలన ప్రక్రియను ఇప్పటికే పూర్తవగా.. మెరిట్ ఆధారంగా అర్హుల జాబితాను మాత్రం అనౌన్స్ చేయలేదు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్‌ను అక్కడితో నిలిపివేశారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని భావించిన విద్యార్థులకు షాక్ తగిలినట్టుయ్యింది.
అప్పటివరకు వెళ్లలేమా?
ఎలక్షన్ కోడ్ గత మార్చి 16 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఎన్నికల ఫలితాలు వచ్చే వరుకు అమల్లో ఉంటుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అంటే ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉంది. నిధులు లేకుండా విద్యార్థులు విదేశాలకు వెళ్లే పరిస్థితి లేదు.ఈ రెండు నెలలకు సంబంధించి సంబంధిత కోర్సుల్లో జాయిన్ అవుదామని భావించిన వారికి ఇది పెద్ద దెబ్బ. నిజానికి ఫారిన్‌లోని చాలా కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రక్రియ ఏప్రిల్ నుంచే మొదలువుతుంది. అయితే అర్హుల జాబితా మాత్రం జూన్ 4 తర్వాతే విడుదలవనుంది.
ఈసీ పర్మిషన్ అడగండి ప్లీజ్:
ఏప్రిల్‌లో విదేశీ అడ్మిషన్స్‌ను దృష్టిలో పెట్టుకోనే ఈ ప్రక్రియను ప్రతీఏడాది జనవరిలోనే ప్రారంభిస్తారు. మరోవైపు అర్హత వస్తుందా రాదానన్న విషయంపై విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. మరికొందరు మాత్రం తాము అర్హత సాధిస్తామని విదేశీ చదువులకు సిద్ధమవుతున్నారు. అర్హత సాధిస్తామన్న ధీమాతో కొందరు అప్పు చేసి మరి విదేశాలకు పయాణం అవుతున్నారు. ఒకవేళ వీరికి అర్హత రాకపోతే పరిస్థితేంటన్నదానిపై ఆందోళన నెలకొంది. ఓవర్సీస్ విద్యానిధి కింద బీసీ సంక్షేమ శాఖ ద్వారా 300 మందికి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి 350 మందికి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 500 మందికి ఆర్థిక సాయం ఇస్తారు. ఈ సాయం కొనసాగించాలని.. ఇది ప్రతీఏడాది జరిగే ప్రక్రియే కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోని ఈసీకి విజ్ఞప్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
Also Read: అప్పటివరకు అమెరికాలోనే ప్రభాకర్ రావు.. పోలీసులకు కీలక సమాచారం!