Telangana Corona Updates: కరోనా మరోసారి హడలెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కటి చొప్పున నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకోగా.. మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.
రోజుకు 4వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలి..
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల లభ్యత, సరైన తీరులో వాటి వినియోగంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాబ్‌ల్లో ఒక్కరోజులో 16,500 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉందని.. మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. డిసెంబర్ నెలాఖరులోగా రోజుకు 4వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాజిటివ్‌గా నిర్థారణ అయిన బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీడీఎఫ్‌డీ, గాంధీ ఆస్పత్రికి పంపించాలన్నారు. ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల హెచ్‌వోడీలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతిరోజూ సాయంత్రం 4గంటల లోపే కొవిడ్ హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు.
Also Read:
కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఫామ్ ఇవే..!
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!