కర్నాటక విజయంతో హస్తం పార్టీ దూకుడు పెచింది. ఎలాగైనా అధికారం పట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ మీద ఫోకాస్‌పెట్టడంతో పాటు.. 12 మందిని టార్గెట్ చేసి ఓడించాలని టీకాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు కనపడుతోంది.
టీకాంగ్రెస్ ఫస్ట్ ఎటాక్ మొదలుకాబోతుంది. 12 మందిని ఓడించేందుకు స్పెషల్ ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో హస్తం పార్టీ గుర్తు మీద గెలిచి ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈసారి ఓడించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్లాన్లు వేసింది. ఇందులో ఎక్కువ మంది రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచే పోటీ చేసి గెలిచినవారే ఉన్నారు. సబిత ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్ రెడ్డి, ఆత్రం సక్కు, జాజల సురేందర్, కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, రేగ కాంతారావు, బానోతు హరిప్రియ, చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి కొంత కాలం పార్టీలో కొనసాగి ఆ తర్వాత అధికార పార్టీకి దగ్గరయ్యారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు అప్పట్లో పార్టీ మారిన నేతలు ప్రకటించారు.
ఈ 12 నియోజక వర్గాలతో పాటు మునుగోడు అసెంబ్లీపై కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఆ పార్టీ వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులుగా పనిచేస్తున్న చామకూర మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు , తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్ , గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, సబితలను ఓడించేందుకు వారు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న అంశంపై ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు సమావేశంలో సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలు, కేసీఆర్ మంత్రి వర్గంలో పనిచేస్తున్న ఏడెనిమిది మంది సభ్యులను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకు బలమైన, ధీటైన నేతలను పోటీకి పెట్టేందుక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భారీ వ్యూహం రచించే పనిలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ మారిన 12 మందిని ఎన్నికల్లో దెబ్బతీయడం ద్వారా సత్తా చాటాలని ఒక పార్టీలో బీ-ఫామ్ తీసుకుని ఆ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత వేరే పార్టీలోకి ఫిరాయిస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియజెప్పేందుకు.. వారిని ఎన్నికల్లో ఓడించి తీరాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వచ్చినట్టు తెలుస్తోంది. కేసీఆర్ మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డితో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.
కొందరు మంత్రులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వేలు జరిపించుకుంటే ఫలితాలు ప్రతికూలంగా మరో వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి సమాచారం అందింది. దీంతో ఒకరిద్దరు మంత్రులు నియోజకవర్గంలో పోటీకి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు బీఆర్ఎస్ అధినాయకత్వం అంగీకరిస్తుందా లేక ఇప్పటి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరితే పరిస్థితి ఏంటన్న ఆందోళనతో మంత్రులున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ వైపు మొగ్గుచూపిన స్థానాల్లో పార్టీ తరఫున బలమైన నేతలను పోటీకి పెడుతున్నామని కాంగ్రెస్ చెబుతోంది. ఎవరూ ఊహించని అభ్యర్థులు పార్టీ తరపున ఎన్నికల బరిలో ఉంటారని వ్యాఖ్యానించారు.