ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు (BRS) గట్టి షాక్ తగిలింది. కల్వకుర్తి నియోజకవర్గంపై గట్టి పట్టు ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayana Reddy) పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు. కల్వకుర్తి టికెట్ దక్కకపోవడం ఆయన కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ మానున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆయనను మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలిపించుకుని మాట్లాడారు. ఎన్నికల తర్వాత కేబినెట్ హోదా కలిగిన పదవి ఇస్తానని కసిరెడ్డికి కేటీఆర్ హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయినా వెనక్కు తగ్గని కసిరెడ్డి పార్టీ మారనున్నట్లు ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ లోని తన నివాసంలో పార్టీ తన అనుచరులు, తనకు మద్దతుగా ఉంటున్న ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తనను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను.. ఇంకో 40 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఏమీ చేయలేనన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తల కోరిక మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు కసిరెడ్డి. ఆయనకు మద్దతు ఇస్తున్న సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము ఎమ్మెల్సీ వర్గమంటూ రాజకీయంగా అణచివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. కసిరెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైందని తెలుస్తోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డితో ఆయన ఈ మేరకు మంతనాలు చేశారని సమాచారం. త్వరలో ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆయన రాజీనామాతో కల్వకుర్తిలో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులేనన్న చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Telangana Congress: ప్రతి పార్లమెంట్‌కు రెండు సీట్లు ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్‌కు బీసీ నేతల డిమాండ్..
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందా? అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచులు. బీఆర్‌ఎస్(BRS) పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మోత్కుపల్లి నర్సింహులు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం నాడు బెంగళూరు వెళ్లిన మోత్కుపల్లి నర్సింహులు.. తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల వ్యవహారాలను చూసుకుంటున్న డీకే శివకుమార్‌ను కలిశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు తన సుముఖతను వ్యక్తం చేశారు. డీకే శివకుమార్ తనను పార్టీలోకి ఆహ్వానించారని, హైదరాబాద్‌కు వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తానని మోత్కుపల్లి తెలిపారు.