ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర ఓ లారీడ్రైవర్ పై ట్రాఫిక్ పోలీసులు చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా బండ బూతులు తిట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధికారిక X ఖాతాలోనూ ఈ వీడియోను పోస్టు చేశారు. ''చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా.. పాలించేటోడు ఎట్లుంటడో కింద వ్యవస్థ కూడా అట్లనే ఉంటది. తప్పు చేస్తే జరిమానా విధించాలి లేదా కేసు ఫైల్ చేయాలి కానీ దూషించుడు ఏంది? ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేసి బూతుల పోలీసింగ్ తెచ్చుడేనా మీ మార్పు?'' అంటూ బీఆర్ఎస్ ఈ వీడియోపై ఫైర్ అయ్యింది. ఈ వీడియోను తెలంగాణ డీజీపీకి ట్యాగ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం షేర్ చేశారు.
ఇది ఆమోదయోగ్యమైన ప్రవర్తనా?.. అని ప్రశ్నించారు. పోలీసు సిబ్బంది, అధికారులకు జీతాలు చెల్లించేది పౌరులేనని దయచేసి గుర్తుంచుకోవాలని సూచించారు. తన ఈ ట్వీట్ కేవలం ఒక సంఘటన గురించి మాత్రమే కాదన్నారు. పౌరులతో పోలీసులు అత్యంత అనుచితంగా ప్రవర్తిస్తున్న అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూస్తున్నానన్నారు. పౌరులతో ప్రత్యక్ష సంబంధంలో ఉండే పోలీసుల ప్రవర్తనను మార్చేందుకు తరగతులు నిర్వహిస్తారని ఆశిస్తున్నానన్నారు. అయితే.. కేటీఆర్ పోస్టుకు తెలంగాణ పోలీసులు స్పందించారు.
కేటీఆర్ ట్వీట్ కు తెలంగాణ పోలీసులు రిప్లై ఇచ్చారు. ఈ ఘటన సైబరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ లిమిట్స్ లో జరిగిందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అతడిని ఆ స్టేషన్ నుంచి బదిలీ చేశామన్నారు. తాము 24/7 ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాం అని పేర్కొన్నారు.