నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి నేడు స్థానిక సూపర్ మార్కెట్ వెళ్లారు. తండ్రి రాజశేఖర్ సూపర్ మార్కెట్‌లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వస్తువులు తీసుకుంటున్నాడు. పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేందుకు చిన్నారి ప్రయత్నించింది. ఇంతలో డోర్ షాక్ కొట్టి అక్కడికక్కడే చిన్నారి రుషిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
అసలేం జరిగింది..?
నందిపేట్ పట్టణంలోని ఎన్‌మార్ట్ అనే సూపర్ మార్కెట్‌కు తండ్రి..నాలుగేళ్ల చిన్నారి రుషిత వెళ్లారు. తండ్రితో కలిసి వస్తువులు కొనుగోలు చేస్తున్న సమయంలోనే మార్ట్‌లోని ఫ్రిడ్జ్‌లో చాక్లెట్లు, ఐస్ క్రీమ్ లను చిన్నారి గమనించింది. దీంతో వాటిని తీసుకునేందుకు డోర్ తీసిన వెంటనే కరెంట్ షాక్ కు గురైంది. చిన్నారి రుషిత విద్యుత్ షాక్‌తో ఒక్కసారిగా గిలగిలా కొట్టుకుంటూ ఆ డోర్ దగ్గరే పడిపోయింది. గమనించిన తండ్రి రాజశేఖర్ చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి రిషిత మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆడుతూ పాడుతూ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన చిన్నారి విగతజీవిగా ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఎన్ మార్ట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మరణించిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మార్ట్ యాజమాన్యం, సిబ్బంది సరైన జాగ్రత్తలు పాటించకపోవటం వల్లే ఈ విషాద ఘటన జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో మరో విషాదం..
హైదరాబాద్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. రామంతాపూర్‌లో హోమ్ వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి చెందిన ఘటన వివేక్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఉదయం స్కూల్ వెళ్లిన విద్యార్థి హేమంత్‌ను స్కూల్‌హోమ్‌వర్క్ చేయలేదని యూకేజీ టీచర్ పలకతో తలపై కొట్టింది. దీంతో హేమంత్ వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. బాలుడిని దగ్గర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ... హేమంత్ మరణించాడు. దీంతో రామంతాపూర్‌లోని పాఠశాల దగ్గర విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.