తెలంగాణలో కొత్త ప్రభుత్వం (TS Government) ఏర్పాటైన నాటి నుంచి కొత్త రేషన్ కార్డులకు (New Ration Cards) సంబంధించిన చర్చ సాగుతోంది. అర్హులైన వారంతా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తారన్న ప్రచారం జరగడంతో వారంతా అప్లై చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొందరైతే దరఖాస్తు ప్రాసెస్, కావాల్సిన పత్రాల వివరాలు తెలుసుకునేందుకు మీసేవ కార్యాలయాల చుట్టూ కూడా తిరిగారు. అయితే.. వారందిరికీ తీవ్ర నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: TSRTC: మహిళలకు తెలంగాణ ఆర్టీసీ షాక్.. పురుషులకు ప్రత్యేక సీట్లు!
కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తులు తీసుకుంటే 6 గ్యారంటీల అమలు ఆలస్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 6 గ్యారంటీల కోసం దరఖాస్తులు తీసుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఎవరి దగ్గర తెల్ల రేషన్ కార్డులున్నాయో.. వాళ్లకే 6 గ్యారంటీల్లోని పథకాలు లభించనున్నాయి. ఆరు గ్యారెంటీల కోసం 28వ తేదీ నుంచి వచ్చేనెల 6వరకు దరఖాస్తులను స్వీకరించనుంది ప్రభుత్వం. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 31, జనవరి 1న మినహా మిగతా రోజుల్లో దరఖాస్తులు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.