తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి సవాల్ ఎదురుకాబోతుంది. కాంగ్రెస్ అధికారం చేపట్టి నెల రోజులైన గడవకముందే రాష్ట్రంలో సమ్మేకు దిగబోతున్నట్లు వైద్యశాఖ బృందం ప్రకటించింది. కొంతకాలంగా పలు డిమాండ్ల సాధన కోసం సమ్మెకు వెళ్లాలని వైద్యశాఖ చర్చలు జరపుతున్న విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 19నుంచి సమ్మె చేపట్టబోతున్నట్లు తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.
ఇది కూడా చదవండి : అయ్యో బిడ్డా.. స్కూల్లో వేడి రాగిజావలో పడ్డ ఆరేళ్ల బాలిక
ఈ మేరకు రేపటినుంచి విధులు బహిష్కరించబోతున్నట్లు శనివారం డీఎంఈ రమేశ్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇందులో మూడు నెలలుగా తమకు స్టైఫండ్ రావట్లేదని పేర్కొన్నారు. 'ఎలాంటి పేమెంట్ లేకుండానే ఒక వారంలో దాదాపు 90 గంటలపాటు పనిచేస్తున్నాం. ఈ విషయంపై ఇప్పటికే చాలాసార్లు డీఎంఈ (DME)తోపాటు హెల్త్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీకి వినతిపత్రాలు అందించాం. అయినా ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక మౌనంగా ఉంటూ పనిచేసుకుంటూ పోతే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కనిపించట్లేదు. డిసెంబర్ 19 నుంచి మేము విధుల్లోకి రాలేమని అసోసియేషన్ల బాధ్యులు తెలిపారు. అలాగే ప్రతి నెలా తమకు చెల్లించాల్సిన జీతాలకు ఒక ఫిక్స్ డ్ డేట్ నిర్ణయించాలని, మెడికల్ బిల్లులు, తదితర పనులు చూసుకునేందుకు ఫైనా న్స్ డిపార్ట్ మెంట్ లో ఒక అధికారిని నియమించడం వంటివి తమ ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు.
ఇక ఈ సమ్మేను మంగళవారం ఉదయంనుంచే మొదలుపెడతామని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలంగాణ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కౌశిక్‌కుమార్ వెల్లడించారు. ఇదిలావుంటే రాష్ట్రంలో పరిస్థితులు, పలు శాఖలపై పూర్తి పట్టు సాధించేందుకు కాంగ్రెస్ మంత్రి వర్గం వేగంగా కదులుతోంది. ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కసరత్తులు మొదలుపెట్టింది. అయితే వైద్య శాఖ నుంచే మొదటి సవాల్ ఎదురుకానుండగా రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.