500 Rs LPG Cylinder Eligibility Criteria and Rules: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను (Congress Guarantees) అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీల్లోనే భాగంగానే ముందుగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని (Free Bus Scheme) అమలు చేసింది. ఆ హామీల్లో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కేవలం 500 రూపాయలకే LPG సిలిండర్ను అందించేందుకు మహాలక్ష్మి పథకాన్ని (Mahalaxmi Scheme) అమలు చేస్తోంది.
కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డులు) ఉండి, ప్రస్తుతం LPG గ్యాస్ గృహ వినియోగదారులందరూ ఈ పథకానికి అర్హులే అని కాంగ్రెస్ ప్రభుత్వాధికారులు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన కుటుంబాలకు మహాలక్ష్మి పథకం ప్రయోజనాలు వర్తిస్తాయని అధికారులు వివరించారు.
గడిచిన మూడు సంవత్సరాల్లో ఆ కుటుంబం వినియోగించిన LPG సిలిండర్ల సగటు ప్రతిపాదికగా సబ్సిడీ సిలిండర్లకు పరిమితి ఉంటుందని పేర్కొంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుతం 40 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులున్నారు. దీంతో దాదాపు 40 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకంలో ప్రయోజనాన్ని అందుకుంటారని అధికారులు వివరించారు.
లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ పొందేటప్పుడు పూర్తి ధరను (రిటైల్ ధర) చెల్లించాలని తెలిపారు. లబ్ధిదారులు రూ.500కు అదనంగా చెల్లించిన డబ్బులను గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు తిరిగి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు డైరెక్ట్ బెనిఫిసియర్ ట్రాన్స్ఫర్ DBT విధానం) జమ చేస్తాయని అధికారులు వివరించారు.
అర్హులైన లబ్ధిదారుల జాబితా, ఏజెన్సీలు పంపిణీ చేసిన సిలిండర్ల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీని ప్రతి నెలా గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లిస్తుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం 2024 ఫిబ్రవరి చివరి నుంచి ప్రారంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే గృహజ్యోతి మార్గదర్శకాలను కూడా అధికారులు పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంల గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని అధికారులు వివరించారు. దరఖాస్తుదారులకు ఆధార్ అనుసంధానించిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి. సంబంధిత గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఉండాలి.
అద్దెకున్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులని అధికారులు వివరించారు. ఈ పథకం ద్వారా గృహ విద్యుత్ కనెక్షన్ పై నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సదుపాయం అమలవుతుందని తెలిపారు.
200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే అర్హత కలిగిన కుటుంబాలన్ని ఆ నెలలో జీరో బిల్లును అందుకుంటాయి. ఈ పథకం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 39.9 లక్షల కుటుంబాలు లబ్దిపొందుతాయని అధికారులు వివరించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తో పాటు గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్ తో పూర్తి వివరాలు సమర్పించిన కుటుంబాలన్నీ ఈ ప్రయోజనాన్ని అందుకుంటాయి.
2024 మార్చి నుంచి లబ్దిదారులకు జీరో బిల్లులు జారీ చేస్తారని వివరించారు.అర్హతలున్నప్పటికీ జీరో బిల్లు పొందని గృహ వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకునే సదుపాయం కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు. మండల ఆఫీసు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. తెల్ల రేషన్ కార్డు లింక్ చేసిన ఆధార్, గృహ విద్యుత్ కనెక్షన్ నెంబర్లను సమర్పించాలి.
అర్హులని గుర్తించినట్లయితే, వారు సవరించిన బిల్లును జారీ చేస్తారు. ఈ పథకానికి అర్హుల జాబితాలో నమోదు చేస్తారని అధికారులు పేర్కొన్నారు. అర్హతలున్న వినియోగదారులు దరఖాస్తులను ధ్రువీకరించుకునే అవకాశం కల్పించినందున వారి నుంచి బిల్లు రికవరీ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోరు అని ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు.
Also read: గాయని చిన్మయి శ్రీపాద పై పోలీసు స్టేషన్ లో కేసు నమోదు!