Arogya Mahila: తెలంగాణ మహిళలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కేంద్రాలు ఏర్పాటు చేసింది. తాజాగా మరో 100 మహిళా కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 12 నుంచి అదనంగా వీటిని ప్రారంభించాలని సూచించారు. తెలంగాణలో ఇప్పటికే 272 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉండగా తాజాగా మరిన్ని కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించడంతో ఆ సంఖ్య 372కు పెరగనుంది.
8 రకాల వ్యాధులకు చికిత్స..
ప్రతి మంగళవారం ఈ ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకంగా మహిళా వైద్య సిబ్బంది మాత్రమే ఉంటారు. వీటి ద్వారా ఆడవాళ్లకు 8 రకాల ప్రధాన వ్యాధులకు సంబందించిన చికిత్స అందిస్తారు. మహిళలకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఇక్కడ చెక్ చేయించుకోవచ్చు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత వంటి పరీక్షలతో పాటు థైరాయిడ్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్ వంటి పెద్ద పెద్ద పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారు. అయోడిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో గుర్తించి వాటికి తగిన మందులను అందజేస్తారు. అలాగే విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులకు సంబంధిచిన టెస్టులు, చికిత్స కూడా అందుబాటులో ఉంటుంది. నెలసరి సమస్యలపైనా వైద్యం అందిస్తారు.
సంతాన సమస్యలపై అవగాహన..
సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటి వాటిపైనా అవగాహన కలిగిస్తారు. మోనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు.
ఇది కూడా చదవండి: మాట్లాడటానికి వెళ్లిన వారిపై దాడి చేయడం ఏంటి?