Telangana DSC: తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) తీపి కబురు అందించేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ కొలువు కొట్టేందుకు పల్లెలు వదిలి పట్నం వచ్చి ఒకపూట తిండి తింటూ అహర్నిశలు కష్టపడి చదువుతున్న విద్యార్థులకు ఊపిరి పిల్చుకునే వార్త ఇది. తెలంగాణ ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గతంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే, ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశ కల్పనకొరకు ప్రయత్నాలు చేస్తోంది.
ALSO READ: ప్రతీ ‘పథకం’ సంచలనమే.. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఎన్నికల వరాలు..
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అన్నిటికంటే ముందుగా డీఎస్సి నోటిఫికేషన్ (DSC Notification) వేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే పేపర్ లీకేజీలతో వందల మంది నిరుద్యోగుల ప్రాణాలు తీసుకోడానికి కారణమైన TSPSC ని ప్రక్షాళన చేయనున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన తర్వాతే గ్రూప్స్ నోటిఫికేషన్ వేసే అవకాశముంది. ఇదిలా ఉండగా ఇప్పటికే నిరుద్యోగులు టీజేఎస్ (తెలంగాణ జనసమితి) అధినేత ప్రొఫెసర్ కోదండరాంను కలిసి ముందుగా డీఎస్సీ నిర్వహించేలా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
ALSO READ: తెలంగాణలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు..
పెండింగ్ లో ఉన్న 2 వేల స్పెషల్ టీచర్ పోస్టులను కలిపి మొత్తం 12 వేల పోస్టులకు నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు విడుతల్లో డీఎస్సీ అని పేర్కొంది. ప్రమోషన్ ల ప్రక్రియ పూర్తయితే మరో 10 వేల పోస్టులను భవిష్యత్తులో భర్తీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొత్తం 10 వేల పోస్టులకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక సమాచారం. టెట్లో 3.5 లక్షల మంది అర్హత సాధించారు. 5089 పోస్టులకు 1.77 లక్షల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. అప్లై చేయని వారికి మరో అవకాశం ఇవ్వాలని సైతం కోరినట్లు సమాచారం.