Rythu Bandhu: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రైతుబంధు నిధుల జమ ప్రక్రియ వేగవంతం చేసింది. మొన్నటి వరకు ఎకరంలోపు ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు 2 ఎకరాల పైబడి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నట్లు సమాచారం. జనవరి చివరికల్లా అందరికీ నిధులు అందేలా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర సర్కార్.
ప్రస్తుతానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) ఇచ్చినట్లుగా ఎకరానికి రూ. 5 వేలు ఇస్తోంది. ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. త్వరలోనే రైతుభరోసాగా రైతు బంధు పథకం మారనున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ సీజన్‌లో రూ.15 వేలు ఇచ్చేలా చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్.
ALSO READ: బీజేపీ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 5 నుంచి రథయాత్ర షురూ
ఒక ఎకరాలోపే..
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని గత డిసెంబరు 9వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఖజనాలో డబ్బులు నిండుకోవటంతో రైతుబంధుకు (Rythu Bandhu) నిధులు సర్దుబాటు చేయటం కష్టంగా మారింది. తొలుత ఒకఎకరం వరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సుమారు 21 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,050 కోట్లు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 69 లక్షల మంది ఉన్న రైతులకు ఎకరాకు రూ.5,000 చొప్పున ఇవ్వాలంటే రూ. 7,625 కోట్ల నిధులు కావాలని నివేదికలు చెబుతున్నాయి.
రూ.2లక్షల రుణమాఫీ..
రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఒకేదఫాలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. రైతులకు ఇచ్చిన హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని తుమ్మల భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) హామీ ఇచ్చింది. రూ.2లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. రైతు రుణమాఫీపై ఇప్పటికే కాంగ్రెస్‌ను బీఆర్‌ఎస్ పార్టీ టార్గెట్ చేసింది.
రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్..
తెలంగాణలోని రైతులు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న క్రాప్ లోన్ల(Crop Loans) వల్ల వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. తర్వాత బ్యాంకులకు విడతలవారీగా ప్రభుత్వం కట్టనుంది. ఇందుకోసం SLBC, ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది సర్కార్.
2023 డిసెంబర్ 7వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తించనుంది. రూ.28వేల కోట్ల మేర లోన్లు ఉంటాయని బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలిపారు. ఇందులో రూ.లక్ష వరకు ఉన్న పంట రుణాలే 80శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ చేయడం ద్వారా దాదాపు 30లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ALSO READ: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా